Begin typing your search above and press return to search.

దారుణం : చేయని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష

జపాన్‌లో ఒక విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవావో హకమాడ అనే వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 46 ఏళ్ల పాటు కటకటాల వెనక గడిపాడు

By:  Tupaki Desk   |   26 March 2025 6:00 PM IST
దారుణం : చేయని తప్పుకు 46 ఏళ్ల జైలు శిక్ష
X

జపాన్‌లో ఒక విషాదకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇవావో హకమాడ అనే వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 46 ఏళ్ల పాటు కటకటాల వెనక గడిపాడు. చివరకు న్యాయం గెలిచి అతడు నిర్దోషిగా విడుదల కావడమే కాకుండా కోర్టు అతడికి భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

1966లో ఇవావో హకమాడ అనే వ్యక్తి ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో ఆ ప్లాంట్ యజమాని, అతని భార్య , ఇద్దరు పిల్లలు వారి ఇంట్లోనే దారుణంగా కత్తిపోట్లకు గురై హత్య చేయబడ్డారు. ఈ కేసులో పోలీసులు హకమాడను అనుమానించి, తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అతడిని అరెస్టు చేశారు.

పోలీసులు కోర్టులో సమర్పించిన తప్పుడు సాక్ష్యాల ఆధారంగా, హకమాడను దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించారు. అయితే దాన్ని యావజ్జీవ శిక్షగా తర్వాత మార్చారు. ఆ తర్వాత అతను దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఈ సుదీర్ఘ కాలంలో అతను తాను నిర్దోషినని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

అయితే కాలం గడిచే కొద్దీ ఈ కేసులోని లొసుగులు బయటపడటం మొదలైంది. పోలీసులు సృష్టించిన సాక్ష్యాలు నమ్మదగినవి కావని తేలింది. దీంతో హకమాడ తరపు న్యాయవాదులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత హకమాడ నిర్దోషి అని కోర్టు తేల్చి చెప్పింది.

అన్యాయంగా 46 ఏళ్లు జైలు జీవితం అనుభవించిన హకమాడకు న్యాయం ఆలస్యంగానైనా దక్కింది. కోర్టు అతడికి దాదాపు ₹12 కోట్ల (సుమారు 1.157 బిలియన్ జపనీస్ యెన్) నష్టపరిహారం చెల్లించాలని పోలీసులను ఆదేశించింది. చేయని తప్పుకు ఇంత సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించిన ఒక వ్యక్తికి ఈ పరిహారం కొంత ఊరటనిస్తుందని భావించవచ్చు.

ఈ ఘటన న్యాయ వ్యవస్థలో చోటు చేసుకునే పొరపాట్లను , వాటి వల్ల ఒక వ్యక్తి జీవితం ఎలా నాశనమవుతుందో తెలియజేస్తుంది. తప్పుడు దర్యాప్తు , సాక్ష్యాల వల్ల ఒక నిర్దోషి ఎన్ని సంవత్సరాలు బాధపడాల్సి వస్తుందో ఈ ఉదంతం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉంది.