Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పాలనలో ప్రపంచ కప్పులు.. బీజేపీ హయాంలో ఫైనళ్లు..

ఈ నేపథ్యంలోనే దేశంలో వన్డే ప్రపంచ కప్ జరిగింది. బహుశా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల వాతావరణం నడుమ ప్రపంచ కప్ క్రికెట్ నిర్వహించారు.

By:  Tupaki Desk   |   21 Nov 2023 9:40 AM GMT
కాంగ్రెస్ పాలనలో ప్రపంచ కప్పులు.. బీజేపీ హయాంలో ఫైనళ్లు..
X

దేశంలో ఇప్పుడంతా ఎన్నికలమయం. ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ వంటివి. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలు పైనల్స్ అనుకోవాలి. అందులోనూ ఇప్పుడు ఎన్నికలున్న రాష్ట్రాలు మామూలువి కాదు. ఆరు నెలల కిందట కర్ణాటకలో ఘోర పరాజయం పాలైనప్పటికీ.. ఇదిగో అదిగో అధికారంలోకి వచ్చేస్తున్నాం అని బీజేపీ తెలంగాణలో గొప్పలు పోతోంది. రాజస్థాన్ లో ఈసారి పీఠం మాదే అంటోంది. మధ్యప్రదేశ్ ను నిలబెట్టుకుంటాం అని చెబుతోంది. ఛత్తీస్ గడ్ చేజారదంటోంది. అటు కాంగ్రెస్ కూడా కర్ణాటక ఘన విజయం ఇచ్చిన ఊపుతో తెలంగాణలో దూకుడు చూపుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ తమవే అంటోంది. రాజస్థాన్ నూ చేజారనీయం అని సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో వన్డే ప్రపంచ కప్ జరిగింది. బహుశా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల వాతావరణం నడుమ ప్రపంచ కప్ క్రికెట్ నిర్వహించారు. ఇది కాస్త ప్రత్యేకమే అనుకుంటే.. ఫైనల్ అనంతరం సరికొత్త విశ్లేషణలకు దిగుతున్నారు కొందరు.

రెండు కప్ లూ అప్పుడే..

భారత క్రికెట్ జట్టు 1983, 2011లో వన్డే ప్రపంచ కప్ లు గెలిచింది. ఆ రెండు సందర్భాల్లో కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్లుగా వ్యవహరించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 1983 సమయానికి దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. నాడు కాంగ్రెస్ ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2011లో మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వానికి సారథిగా వ్యవహరించారు. అంటే.. టీమిండియా ప్రపంచ కప్ లు గెలిచిన సమయంలో ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నమాట. ఇక 1983 ప్రపంచ కప్ ఇంగ్లండ్ లో జరిగింది. 2011లో మాత్రం భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లతో కలిసి ఆతిథ్యం ఇచ్చింది. మొదటిసారి వెస్టిండీస్ పై, రెండోసారి శ్రీలంకపై నెగ్గి ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది.

రెండు ఓటములూ ఇప్పుడే..

టీమిండియా 2003లో దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. అప్పట్లో ఆసీస్ అజేయంగా కప్ కొట్టింది. ఈసారి టీమిండియా వరుసగా పది మ్యాచ్ లు గెలిచి ఫైనల్ చేరింది. కానీ, ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మరోవైపు ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్ లను భారత్, దక్షిణాఫ్రికాలతో ఆడి ఓడిపోయింది. కానీ, ఆ తర్వాత వరుసగా 9 మ్యాచ్ లలో నెగ్గి కప్ కొట్టేసింది. లీగ్ దశలో తమను ఓడించిన దక్షిణాఫ్రికాను సెమీస్ ను, భారత్ ను ఫైనల్లో మట్టికరిపించింది. కాగా, టీమిండియా ఫైనల్లో ఓడిన రెండుసార్లు (2003, 2011) భారత్ లో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. 2003లో వాజ్ పేయీ దేశ ప్రధానిగా ఉన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధాని. మరోవైపు తాజాగా ముగిసిన కప్ నకు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, కప్ కొట్టలేకపోయిన నేపథ్యాన్ని రాజకీయాలకు అన్వయిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న సమయంలో టీమిండియా ప్రపంచ విజేతగా ఆవిర్భవించింది.. బీజేపీ పాలనలో ఫైనల్లో పరాజయం పాలైందంటూ పోలిక తెస్తున్నారు. వాస్తవానికి టీమిండియా గెలుపు-ఓటముల్లో రాజకీయ పార్టీల పాత్రేమీ లేకున్నా.. ఎన్నికల సమయం కాబట్టి అలా అన్వయించుకుంటున్నారు.