తాజారిపోర్టు: మనదగ్గరి అణ్వాయుధాలు ఎన్ని.. పాక్ వద్ద ఉన్నవెన్ని?
ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేసే అత్యంత శక్తివంతమైన.. వినాశకరమైన అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను స్టాక్ హోమ్ కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రి) తాజాగా వెల్లడించింది
By: Garuda Media | 9 Jun 2026 9:54 AM ISTప్రపంచాన్ని సమూలంగా నాశనం చేసే అత్యంత శక్తివంతమైన.. వినాశకరమైన అణ్వాయుధాలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను స్టాక్ హోమ్ కు చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (సిప్రి) తాజాగా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లుగా ఈ సంస్థ విడుదల చేసిన ఇయర్ బుక్ లో పేర్కొన్నారు. సిప్రి ఇయర్ బుక్ 2026లో పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి.. భద్రతాపరమైన సవాళ్ల వేళ.. భారతప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందన్న వివరాల్ని అందులో పొందుపర్చారు.
ప్రపంచంలో మొత్తం తొమ్మిది దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆసియా ఖండంలోని ఐదు దేశాల్లో అణ్వాయుధ సామర్థ్యం ఉండటం గమనార్హం.మొత్తం 12,187 అణ్వాయుధాలు ఉంటే.. ప్రస్తుతం 9745 అణ్వాయుధాలు తక్షణ సైనిక అవసరాల కోసం నిల్వ చేసినట్లుగా చెప్పాలి. మిగిలినవి కాలం చెల్లినవిగా చెబుతున్నారు. దీంతో.. వీటిని నిర్వీర్యం చేసే ప్రక్రియలో ఉంచినట్లుగా తాజా రిపోర్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాలు ఉన్న తొమ్మిది దేశాల్ని చూస్తే..
అమెరికా
రష్యా
బ్రిటన్
ఫ్రాన్స్
చైనా
భారత్
పాకిస్తాన్
ఉత్తరకొరియా
ఇజ్రాయెల్
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అణ్వాయుధాలు ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నాయన్న ప్రశ్నను సంధిస్తే.. అత్యధికులు ప్రపంచానికి పెద్దన్న అమెరికా వద్దే అని చెప్పే వీలుంది. కానీ.. వాస్తవం ఏమంటే.. రష్యా ఈ జాబితాలో ముందు ఉండటం. ఆ దేశం వద్ద మొత్తం 5459 అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే.. ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాల్లో రష్యా వద్ద 44.49 శాతం ఉంటే.. అమెరికా వద్ద ఉన్న అణ్వాయుధాలు 42.19 శాతం (5177). పట్టికలో చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయి. కాకుంటే.. చైనా ఇటీవల కాలంలో తన అణ్వాయుధ సంపదను వేగంగా పెంచుతోంది. ఫ్రాన్స్ వద్ద సుమారు 290 అణ్వాయుధాలు ఉండగా.. తర్వాతి స్థానంలో యునైటెట్ కింగ్ డమ్ (యూకే) వద్ద 225 ఉన్నాయి. భారతదేశం వద్ద 190అణ్వాయుధాలు ఉంటే.. దాయాది పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉండటం గమనార్హం. ఇజ్రాయెల్ వద్ద సుమారుగా 90, ఉత్తర కొరియా వద్ద సుమారు 50 అణ్వాయుధాలు ఉన్నట్లుగా ఇందులో పేర్కొన్నారు.
మిగిలిన దేశాలతో పోలిస్తే చైనా తన అణుసామర్థ్యాన్ని మిగిలిన దేశాల కంటే వేగంగా పెంచుకుంటూ పోతోంది. గత ఏడాది 600గా ఉన్న అణ్వాయుధాలు ఈ ఏడాది జనవరి నాటికి మరో 20 పెంచుకోవటం విశేషం. అదే సమయంలో భారత్ - పాక్ విషయాలకువస్తే.. రెండు దేశాల మధ్య అణ్వాయుధ సామర్థ్యం స్వల్ప వ్యత్యాసంతో ఉండటం గమనార్హం. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. శాంతి సమయంలోనూ భారత్ తొలిసారి 12 అణ్వాయుధాలను క్షిపణులకు అనుసంధానించి సిద్ధంగా ఉంచిన వైనం ఈ నివేదికలో పేర్కొనటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ వేళ భారత్ క్షిపణులను సిద్దంగా ఉంచటం ద్వారా పాక్ అణు బ్లాక్ మొయిల్ వ్యూహాన్ని తిప్పికొట్టినట్లుగా చెప్పాలి. మొత్తంగా చూస్తే.. మానవ వినాశనానికి హేతువ అయ్యే అణుక్షిపణుల పెంపును వీలైనంత తక్కువయ్యేలా ఉంచాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. అదే సమయంలో మన శత్రువు అంతకంతకూ పెంచుకుంటున్నఅణుక్షిపణులను తగ్గట్లు భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
