లీటరు నీళ్లు లక్షల్లోనా?.. వాటర్ బాటిల్ కొనాలంటే లోన్ తీసుకోవాల్సిందే!
ఇంతకీ ఆ ఖరీదైన వాటర్ బాటిల్స్ ఏంటి? వాటి బ్రాండ్స్ ఏమిటి? ధరలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
By: Tupaki Desk | 10 April 2025 1:00 AM ISTసాధారణంగా మనం దాహం వేస్తే వెంటనే కొనుక్కునే లీటరు మంచినీళ్ల బాటిల్ మహా అయితే 20 రూపాయలుంటుంది. బాగా ఖరీదైన బ్రాండ్ అయితే వంద రూపాయలు దాటదు. కానీ, మీరు ఎప్పుడైనా ఒక లీటర్ నీళ్ల బాటిల్ ధర లక్షల్లో ఉంటుందని విన్నారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం! ప్రపంచంలో కొంతమంది సెలబ్రిటీలు అంత్యంత ఖరీదైన నీటిని తాగుతారు. ఈ నీరు వారిని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని వారు విశ్వసిస్తారు. ఇంతకీ ఆ ఖరీదైన వాటర్ బాటిల్స్ ఏంటి? వాటి బ్రాండ్స్ ఏమిటి? ధరలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వాటర్: లీటరుకు 2.5 లక్షలు. బ్రెజిల్‌లోని అమెజాన్ వర్షారణ్యం నుండి సేకరించిన ఈ నీరు అంత ఖరీదైనది ఎందుకో మాత్రం అంతుచిక్కడం లేదు!
నెవాస్ డెక్లార్ట్: లీటరుకు ఒక లక్ష రూపాయలు. జర్మనీ నుండి వచ్చే ఈ నీటిని మంచుగడ్డల ద్వారా ఫిల్టర్ చేస్తారు. అందుకే ఇది అత్యంత స్వచ్ఛమైనదని చెబుతారు.
ఫిల్లికో జ్యువెల్లరీ వాటర్: లీటరుకు అక్షరాలా 5 లక్షల రూపాయల పైనే. జపాన్ నుంచి దిగుమతి చేసుకునే ఈ నీటిని స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో అలంకరించిన ప్రత్యేకమైన సీసాల్లో నింపుతారు. ఇది కేవలం నీరు కాదు, ఒక స్టేటస్ సింబల్.
బ్లింగ్ H2O: లీటరుకు దాదాపు 3 లక్షల రూపాయలు. అమెరికాకు చెందిన ఈ వాటర్ బాటిల్ బ్రాండ్ కూడా స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో డిజైన్ చేసిన సీసాలతో లభిస్తుంది. ఇది లగ్జరీ లైఫ్‌స్టైల్ ఉత్పత్తుల్లో ఒకటిగా పేరుగాంచింది.
ROI: లీటరుకు 5 వేల రూపాయల పైనే. ఈ నీటిలో యాక్టివ్ చార్‌కోల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు.
ఉయిస్‌గే సోర్స్: లీటరుకు 5 వేల రూపాయల పైనే. స్కాట్లాండ్ నుండి వచ్చే ఈ నీరు స్కాచ్ విస్కీ తాగేవారికి ప్రత్యేకంగా తయారు చేయబడిందట.
ఎవియన్ వెర్జిన్ అబ్లోహ్: లీటరుకు 17 వేల రూపాయల పైనే. సహజ ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్‌తో నిండిన ఈ నీరు స్టైలిష్ ప్యాకేజింగ్‌తో చాలా ఫేమస్. మన ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఈ బ్రాండ్ నీళ్లే తాగుతారట!
స్వాల్‌బార్డి పోలార్ బ్లూ ఐస్ ఎడిషన్: లీటరుకు 12 వేల రూపాయల పైనే. నార్వేజియన్ బ్రాండ్‌కు చెందిన ఈ నీటిని ఆర్కిటిక్ మంచుకొండల నుండి సేకరిస్తారు. ఇది స్వచ్ఛమైన రుచిని కలిగి ఉంటుందట.
మైనస్ 181: లీటరుకు 6 వేల రూపాయల పైనే. ఈ జర్మన్ బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత చల్లని నీటిని అందిస్తున్నట్లు పేర్కొంది.
