సెల్ఫీ విత్ విన్నింగ్ స్పిన్నర్..! శ్రీచరణికి ఏపీ సూపర్ గిఫ్ట్
మహిళల వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది.
By: Tupaki Political Desk | 7 Nov 2025 3:21 PM ISTమహిళల వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. గత ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నిలబెట్టిన స్పిన్నర్ శ్రీచరణికి రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం కింద రూ.2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచకప్ పోటీల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన శ్రీచరణి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతోపాటు ఆంధ్రా క్రికెట్ అసోసియన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సాన సతీశ్, శాప్ చైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీతో విజయోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీచరణిని వెంటబెట్టుకుని ఉండవిల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.
ఉమెన్స్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తో కలిసి తన నివాసానికి వచ్చిన శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు. శ్రీచరణి ప్రతిభను సీఎం కొనియాడారు. అద్భుత ప్రదర్శనతో దేశాన్ని విజేతగా నిలిపారంటూ అభినందించారు. అంతేకాకుండా దేశానికి విజయాన్ని అందించిన స్పిన్నర్ తో తీసుకున్న సెల్ఫీని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. మంత్రి లోకేశ్ సైతం తన ఎక్స్ లో ‘స్టార్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ను మా నివాసానికి ఆహ్వానించడం గొప్పగౌరవంగా భావిస్తున్నాను’ అంటూ పోస్టు చేశారు. ఆమె విజయం భారతీయ మహిళల బలాన్ని ప్రతిబింబించింది. మహిళలకు స్ఫూర్తినిస్తుందని లోకేశ్ కామెంట్ చేశారు.
కడప జిల్లా యరమలపల్లె గ్రామానికి చెందిన శ్రీచరణి భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ లో రాణించిన శ్రీచరణి జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలిపారు. ఎడమ చేతివాటం స్పిన్నర్ అయిన శ్రీచరణి ప్రపంచ కప్ పోటీల్లో మొత్తం 9 మ్యాచులు ఆడి 14 వికెట్లుతీశారు. ఈ టోర్నమెంటులో దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆమె రెండో స్థానంలో నిలిచారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒత్తిడిలో ఉన్న ప్రతిసారీ శ్రీచరణిని ఉపయోగించుకోగా, ఆమె జట్టుకు బ్రేక్‌త్రూలు అందించింది. 4.96 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసి, పరుగులను నియంత్రించడంలో అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కీలక సమయంలో బ్యాటర్ అన్నేకే బోష్ వికెట్‌ను తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
