Begin typing your search above and press return to search.

మళ్లీ లాక్ డౌన్ నాటి రోజులు! ఐటీ ఉద్యోగులకు పండగే పండగ

లాక్ డౌన్ అంటే అంతా హడలిపోతారు. 2020లో కోవిడ్ పుణ్యమాని యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. మహమ్మారి ప్రభావంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది.

By:  Tupaki Political Desk   |   12 May 2026 1:39 PM IST
మళ్లీ లాక్ డౌన్ నాటి రోజులు! ఐటీ ఉద్యోగులకు పండగే పండగ
X

లాక్ డౌన్ అంటే అంతా హడలిపోతారు. 2020లో కోవిడ్ పుణ్యమాని యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. మహమ్మారి ప్రభావంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సివచ్చింది. అలాంటి సమయంలో ఐటీ రంగం మాత్రం యథావిధిగా పనిచేసింది. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే విధానం మొదలైంది. ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని కొనసాగించినా, చాలా కంపెనీలు మాత్రం ఉద్యోగుల పని సామర్థ్యం పెంచే ఉద్దేశంతో ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చిచెప్పాయి. దీంతో ఇప్పుడు 90 శాతం కంపెనీలు మళ్లీ ఆఫీసు డ్యూటీలే వేస్తున్నాయి. అయితే తాజాగా చమురు సంక్షోభంతో దాదాపు అన్ని ఐటీ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయని అంటున్నారు.

చమురు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క సంస్థ వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేయాలని ప్రధాని మోదీ తాజాగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం హైదరాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పొదుపుగా వాడాలని, మెట్రో సేవలు ఎక్కువగా వినియోగించుకోవాలని, కార్ పూలింగ్ కు ప్రాధాన్యమివ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని సూచించారు. కొవిడ్ సమయంలో అలవాటు పడిన వర్క్ ఫ్రం హోమ్, వర్చవల్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సింగ్ లను మళ్లీ విస్తృతంగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.

దీంతో ఐటీ రంగం మొదటగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గంచడమే లక్ష్యంగా ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. నిరంతరం మారుతున్న భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని నాస్కామ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. చాలా కంపెనీలు క్యాంపస్ లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని స్పష్టం చేసింది. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా కొన్ని సౌకర్యాలను పరిమితం చేస్తున్నట్లు వివరించింది.

రిమోట్ లేదా హైబ్రిడ్ విధానాలతో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాలను తగ్గించి, తద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు నాస్కామ్ ప్రకటించింది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై నగరాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగం వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా జరుగుతోందని అంటున్నారు. దీంతో అవకాశం ఉన్న ప్రతిచోటా వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘమైన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రం అధికారిక అడ్వజయిరీ జారీ చేయాలని ఆ లేఖలో కోరింది.

మరోవైపు ఇంధన వ్యయం పెరుగుతుండటం వల్ల కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం విధానానికి మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. భారీ క్యాంపస్ లు నిర్వహించే కంపెనీలు విద్యుత్, డీజిల్ జనరేటర్ వినియోగం, ఉద్యోగుల ట్రాన్స్ పోర్టు ఖర్చులను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా తిరిగి వర్క్ ఫ్రం హోం ప్రవేశపెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్రం కూడా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించేలా నిబంధనలు తీసుకువచ్చే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఐటీ ఉద్యోగులు మళ్లీ ఇంటి వద్ద పని చేసుకునే పరిస్థితి వస్తోందని అంటున్నారు.