Begin typing your search above and press return to search.

‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మోసం.. స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు!!

ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశపెట్టి, సామాన్య ప్రజల నమ్మకంతో ఆడుకున్న ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Aug 2026 3:50 PM IST
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మోసం.. స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ తో కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు!!
X

ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ. 30 వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశపెట్టి, సామాన్య ప్రజల నమ్మకంతో ఆడుకున్న ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది. స్క్రబ్బర్ (పాత్రలు తోమే పీచు) తయారీ, ప్యాకింగ్ బిజినెస్ పేరుతో 'మాషా అల్లాహ్ ఎంటర్‌ప్రైజెస్' అనే సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల మందిని నట్టేట ముంచిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. మధ్యతరగతి మహిళలు, నిరుద్యోగులే లక్ష్యంగా ఈ సంస్థ సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహించి, ‘మా వద్ద మిషన్ కొనుగోలు చేయండి, రా మెటీరియల్ మేమే ఇస్తాం, మీరు ప్యాక్ చేసి ఇస్తే చాలు, మార్కెటింగ్ బాధ్యత మాది’ అంటూ నమ్మబలికినట్లు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో పలు నగరాలకు చెందిన మహిళలను మోసం భారీగా డబ్బు దండుకుని ఉడాయించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

మహిళలకు ఇళ్ల వద్దే ఉపాధి కల్పిస్తామని చెబుతూ మిషన్ కోసం రూ. 30,000- డిపాజిట్‌గా రూ. 1,00,000 చొప్పున ఒక్కో వ్యక్తి నుండి భారీగా వసూలు చేసినట్లు చెబుతున్నారు. నెలకు 6,000 స్క్రబ్బర్లు తయారు చేసి ఇస్తే రూ. 24,000 నుండి రూ. 30,000 వరకు ప్రతి నెలా చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి మొదటి మూడు నెలలు సక్రమంగా ముడిసరుకు అందించడమే కాకుండా, బాధితులకు చెల్లింపులు కూడా జరిపారని అంటున్నారు. సంస్థపై నమ్మకం పెరగడంతో వేలమంది పెట్టుబడి పెట్టగా, ఆ తర్వాత ముడిసరుకు సరఫరాను హఠాత్తుగా నిలిపివేశారని బాధతులు గగ్గోలు పెడుతున్నారు. బాధితులు కార్యాలయానికి వెళ్లి చూడగా, విజయవాడ సత్యనారాయణపురంలోని ఆఫీసు మూసివేసి ఉందని, నిర్వాహకుల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో, తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారని చెబుతున్నారు.

ఈ సంస్థ కేవలం విజయవాడకే పరిమితం కాకుండా రాజమండ్రి, కాకినాడ, కడప, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా విస్తరించిందని సమాచారం. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు దాదాపు 4,000 మందికి పైగా అమాయకులు మాషా అల్లాహ్ ఎంటర్‌ప్రైజెస్ లో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు రూ. వందల కోట్లు వరకు వసూలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి, ఇంట్లోని నగలు తాకట్టు పెట్టి, కష్టపడి కూడబెట్టిన డబ్బును ఈ మోసగాళ్ల చేతిలో పెట్టిన బాధితులు ఇప్పుడు రోడ్డున పడ్డామని కన్నీరు పెడుతున్నారు.

బాధితుల ఫిర్యాదుతో విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ప్రధాన నిందితుడు పసుపులేటి అంకుశం, డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ భారీ మోసంపై లోతైన దర్యాప్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఇలాంటి 'వర్క్ ఫ్రమ్ హోమ్' లేదా 'తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం' అంటూ వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.