Begin typing your search above and press return to search.

రీల్ ‘నీలాంబరి’ అప్ గ్రేడ్ వెర్షన్ రియల్ లైఫ్ లోకి వస్తే

ఈ ఉదంతం గురించి విన్నంతనే అప్పట్లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘నరసింహ’ గుర్తుకు రాక మానదు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 4:25 AM GMT
రీల్ ‘నీలాంబరి’ అప్ గ్రేడ్ వెర్షన్ రియల్ లైఫ్ లోకి వస్తే
X

ఈ ఉదంతం గురించి విన్నంతనే అప్పట్లో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ‘నరసింహ’ గుర్తుకు రాక మానదు. తాను కోరుకున్న హీరో కోసం నీలాంబరి క్యారెక్టర్ ఎంతలా తపించిపోవం.. తనకు దక్కక అందుకోసం ప్రతీకారం కోసం రగిలిపోయే తీరు ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. రీల్ నీలాంబరి క్యారెక్టర్ అప్ గ్రేడ్ అయి.. రియల్ లైఫ్ లోకి వస్తే ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు రూపంగా తాజా ఉదంతానని చెప్పొచ్చు. తన మనసుకు నచ్చినోడి కోసం ఒక సంపన్న యువతి తెగించిన తీరు షాకింగ్ గా మారుతుంది.

నాలుగైదు స్టార్టప్ కంపెనీలకు యజమాని అయిన ఆమె.. ఆన్ లైన్ లో తాను మనసుపడిన కుర్రాడి కోసం మరీ ఇంతలా తెగించటం ఏమిటి?అన్నది షాకింగ్ అంశంగా మారింది. తనకు నచ్చాడు కాబట్టి.. తనను పెళ్లి చేసుకోవాలని అడగటమే కాదు.. నో అన్నందుకు తన వాళ్ల చేత కిడ్నాప్ చేయించి.. కొట్టించిన ఉదంతం వింటే రీల్ నీలాంబరి చప్పున గుర్తుకు రావటం ఖాయం. హైదరాబాద్ లో సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

మాదాపూర్‌కు చెందిన 31 ఏళ్ల అమ్మాయి ఒక డిజిటల్ సంస్థను నిర్వహిస్తోంది. ఆమెకు మరో మూడు స్టార్టప్ లు ఉన్నట్లుగా చెబుతున్నారు. సంపన్న వర్గానికి చెందిన ఆమెకు గతంలో పెళ్లైంది. భర్త నుంచి విడాకులు తీసుకొని దూరంగా ఉంటోంది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీ సైట్లలో తగిన మ్యాచ్ కోసం వెతుకుతోంది. భారత్ మ్యాట్రిమోనీ సైట్ లో ఒక ప్రొఫైల్ చూసింది. అయితే.. అదో ఫేక్ ప్రొఫైల్. అందులో పెట్టిన ఫోటోకు.. ఆ అకౌంట్ ను క్రియేట్ చేసినోడికి సంబంధం లేదు.

ఆన్ లైన్ ప్రకటనల్లో నటించే యువకుడి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. అమాయకులను వల విసరుతుండే ఒక సైబర్ నేరగాడి ప్రొఫైల్. అయితే.. ఆ ఫోటోను చూసిన ఈమె చాట్ చేయటం షురూ చేసింది. ఇంతకూ ఆ ఫోటో ఎవరిదంటే ఉప్పల్ లోని న్యూ భరత్ నగర్ కు చెందిన 27 ఏళ్ల వ్యక్తిది. అయితే.. ఫేక్ ప్రొఫైల్ అని తెలీక.. ఫోటో నచ్చి చాటింగ్ చేస్తున్న ఆమె.. అందులో భాగంగా ఎమోషనల్ గా కనెక్టు అయ్యింది. ఇదే అదనుగా సైబర్ నేరగాడు ఆమె నుంచి రూ.40 లక్షలు లాగేశాడు.

మోసపూరిత మాటలతో దఫదఫాలుగా ఆమె నుంచి డబ్బులు లాగేశాడు. మనసుకు నచ్చినోడు కాబట్టి.. డబ్బులు ఇస్తున్నా ఆమె పెద్దగా ఫీల్ కాలేదు. తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని.. భారీగా లాభాలు వస్తాయని చెప్పటంతో ఆమె నమ్మేసి ఇంత భారీగా డబ్బులు ఇచ్చేసింది. కొంతకాలానికి తన డబ్బులు ఇవ్వాలని కోరితే అవతల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో.. ఆ ఫోటో ఆధారంగా అతడెవరు? అన్నది ఆరా తీసి.. చివరకు అతడి ఫోన్ నెంబరు (సైబర్ నేరగాడిది కాదు.. ఫోటోలోని వ్యక్తిది) సంపాదించి.. అతడితో మాట్లాడింది.

ఆన్ లైన్ లో ఫోటో చూసి మనసు పడ్డానని.. అందులో భాగంగా రూ.40 లక్షలు ఇచ్చినట్లుగా చెప్పటంతో.. ఆమెకు అసలు విషయాన్ని వివరించిన ప్రణవ్.. ఆమె పెళ్లి ప్రపోజల్ ను రిజెక్టు చేశాడు. ఆమెను దూరం పెట్టాడు. దీంతో.. అతడ్ని ఎలా అయినా పెళ్లి చేసకోవాలన్న ఆమె అతడి కిడ్నాప్ కు ప్లాన్ చేసింది. అతడి కారుకు ఒక ట్రాకర్ ను అమర్చి.. అతని కదలికలపై కన్నేసింది. అతనిను కిడ్నాప్ చేసేందుకు తన సంస్థలో పని చేసే వ్యక్తిని పురామాయించింది. చివరకు ఈ నెల 11న ఇంటికి వెళుతున్న ఆ వ్యక్తి ని కిడ్నాప్ చేసి.. అతడ్ని తన ఆఫీసుకు తీసుకొచ్చారు. పెళ్లికి నో చెప్పాడని తీవ్రంగా కొట్టారు. చివరకు దెబ్బలకు తాళలేక.. ఆమె ఫోన్ కాల్స్ కు రియాక్టు అవుతానని చెప్పటంతో అతడ్ని వదిలేశారు. దీంతో.. బయట పడిన అతను పోలీసుల్ని ఆశ్రయించి.. తనకు ఎదురైన టార్చర్ ను వివరించారు. రంగంలోకి దిగిన పోలీసులు రీల్ నీలాంబరికి మించిన రియల్ క్యారెక్టర్ ను అరెస్టు చేశారు. కిడ్నాప్ లో ఆమెకు సహకరించిన వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.