Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి ఘోర అవ‌మానం.. చెప్పు చూపించి మ‌రీ!

త‌న‌కు ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించిన స‌ద‌రు బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే క‌మ్ అభ్య‌ర్థికి స్థానిక మ‌హిళ ఒక‌రు చెప్పు చూపించారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 1:30 AM GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి ఘోర అవ‌మానం.. చెప్పు చూపించి మ‌రీ!
X

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. మ‌రో నాలుగు రోజుల్లో ప్ర‌చారం ముగియ‌నుంది. దీంతో అధికార పార్టీ బీఆర్ ఎస్ నాయ‌కులు ఊరూవాడా చుట్టేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకురెడీ అవుతున్నారు. అయితే.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు హార‌తులు ప‌ట్టి ఆహ్వానాలు ప‌లుకుతుండ‌గా.. మ‌రికొన్న చోట్ల ఎదురుగాలులు వీస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు ప్ర‌జ‌లను స‌హ‌నంతో ఓటు వేయాల‌ని కోరుతున్నారు.

ఇక‌, తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి భారీ ఎదురుగాలి వీచింది. అదేస‌మ‌యంలో ఘోర అవ‌మానం కూడా జ‌రిగింది. త‌న‌కు ఓటు వేయాల‌ని అభ్య‌ర్థించిన స‌ద‌రు బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే క‌మ్ అభ్య‌ర్థికి స్థానిక మ‌హిళ ఒక‌రు చెప్పు చూపించారు. అంతేకాదు.. చెప్పుతో కొడ‌తా.. వెళ్లిపో! అంటూ హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా వైర‌ల్ అవుతోంది.

ఎక్క‌డంటే..

రాజేంద్రనగర్ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్థానికంగా గురువారం ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశారు. అయితే, ప్రకాష్‌గౌడ్‌ను ఇక్క‌డి మహిళలు వంద‌ల సంఖ్య‌లో అడ్డుకున్నారు. తమ కాలనీలో సమస్యలు తీర్చకుండా ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా గ‌త ఎన్నిక‌ల హామీల‌ను ఆయ‌న‌కు గుర్తు చేశారు.

ఈక్ర‌మంలో ప్ర‌కాష్ గౌడ్ వారికి స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆగ్ర‌హంతో ఉన్న మహిళ‌ల్లో ఒక‌రు.. "చెప్పుతో కొడతాం వెళ్లిపో" అంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థిపై మండిపడ్డారు. అంతేకాదు.. మ‌రొక‌రు చెప్పు కూడా చూపించారు. ఈ ప‌రిణామాన్ని ఊహించ‌ని.. మహిళల నిరసనలను అంచ‌నా వేయ‌ని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షాక్ అయ్యారు. చేసేదేమీ లేక ప్రచారం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.