Begin typing your search above and press return to search.

మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి ఎంత ?

ఇప్పటికి ముప్పయ్యేళ్ళుగా మహిళా రిజర్వేషన్లు అన్నది దేశంలో నలుగుతూనే ఉంది. దేశంలోని మహిళలకు పార్లమెంట్ అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్నది ఒక ఉద్దేశ్యం.

By:  Satya P   |   18 April 2026 9:18 AM IST
మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి ఎంత ?
X

ఇప్పటికి ముప్పయ్యేళ్ళుగా మహిళా రిజర్వేషన్లు అన్నది దేశంలో నలుగుతూనే ఉంది. దేశంలోని మహిళలకు పార్లమెంట్ అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్నది ఒక ఉద్దేశ్యం. నిజానికి దేశ జనాభా 70 కోట్లలో ఉన్నపుడు పుట్టిన ఆలోచన ఇది. ఇపుడు చూస్తే డబుల్ అయింది కానీ మూడు దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా మహిళా బిల్లు గడప దాటి అమలులోకి రావడం లేదు. మహిళలకు కూడా తాము హక్కుగా దర్జాగా చట్ట సభలలో ప్రవేశించే అవకాశం కూడా నెరవేరడం లేదు. దీనికి ఎవరు కారణం అంటే అంతా అని చెప్పాల్సిందే అంటున్నారు.

అనేక అవాంతరాలు :

మహిళా రిజర్వేషన్ బిల్లుని మొదటిసారిగా 1996లో లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల 1996లోనే కాదు, 1998, 1999, 2008 దాకా బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. ఆ తర్వాత, 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2023 సెప్టెంబర్ లో ఆమోదించారు. అయినా సరే అమలు చేయడానికి సవా లక్ష ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఈ డిమాండ్లతో సైతం :

ఇక మహిళా రిజర్వేషన్ బిల్లులోని ఉప కోటా కోసం డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది. షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన తరగతుల మహిళలకు 33 శాతం కోటాలోనే రిజర్వేషన్లు కేటాయించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అయితే ఈ బిల్లు విషయంలో ఎక్కడా రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడంతో పాటు కొన్ని రాజకీయ వర్గాల నుండి వచ్చిన బలమైన వ్యతిరేకత కారణంగా పార్లమెంటులో బిల్లును పట్టించుకోకపోవడం వల్ల అనేక సార్లు వెనక్కి పోతూ వచ్చింది. సరే ఇంత జరిగి నారీ శక్తి వందన అధినియమ్గా ఇప్పుడు చట్టంగా మారింది.

హడావుడిగా సభ ముందుకు :

దీని ద్వారా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడుతుందని చట్టంలో స్పష్టంగా ఉంది. అంతే కాదు రొటేషన్ పద్ధతిలో సీట్లు కేటాయించబడతాయని కూడా ఈ చట్టం హామీ ఇస్తోంది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి జనాభా గణన అనంతరం జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో ఈ రిజర్వేషన్ అమలు ముడిపడి ఉంటుందని కూడా స్పష్టంగా ఉంది. కానీ జనాభా గణన కాకుండానే హడావుడిగా లోక్ సభ ముందుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకుని వచ్చి అభాసుపాలు అయింది.

విడిగా పెడితే ఓకే :

అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుని విడిగా ప్రవేశపెడితే తాము మద్దతు ఇస్తామని విపక్షాలు అన్నీ ప్రకటించాయి. కానీ డీలిమిటేషన్ తోనే ముడి పెట్టి ప్రభుత్వం తీసుకుని రావడం వల్లనే ఇలా జరిగింది అని విమర్శిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ చిత్తశుద్ధీ విపక్షాలు ప్రశ్నిస్తూంటే ఈ బిల్లుని ఆమోదించకుండా విపక్షాలు మహిళా వ్యతిరేకులుగా మారాయని బీజేపీ కూడా నిందిసోంది. మొత్తం మీద రాజకీయ సుడిగుండంలో పడి మహిళా బిల్లు కొట్టుకుంటోంది అని అంటున్నారు.