Begin typing your search above and press return to search.

మహిళలకు అన్ని విధాలా ఒక మంచి దేశం.. ఇదే!

డెన్మార్క్‌ అని ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’ తెలిపింది. 2023 సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   3 March 2024 1:49 PM GMT
మహిళలకు అన్ని విధాలా ఒక మంచి దేశం.. ఇదే!
X

మహిళలకు భద్రత, ప్రశాంతత, సమానత్వం, శాంతి, సంతోషాన్ని ఇచ్చే దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది డెన్మార్క్‌ అని ‘విమెన్‌ పీస్‌ అండ్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌’ తెలిపింది. 2023 సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. మొత్తం 176 దేశాలకు ర్యాంకులు ఇవ్వగా డెన్మార్క్‌ మొదటి స్థానం దక్కించుకుంది. భారత్‌ 128వ స్థానంలో నిలిచింది. నమీబియా, జింబాబ్వే, అంగోలా లాంటి దేశాల కంటే భారత్‌ దిగువన నిలవడం గమనార్హం.

ఇండెక్స్‌ లో డెన్మార్క్‌ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్, లగ్జెంబర్గ్‌... తర్వాత స్థానాలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు బెస్ట్‌ దేశంగా డెన్మార్క్‌ ఎందుకు నిలిచింది.. ఆ దేశంలో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

డెన్మార్క్‌ లో బలవంతపు పెళ్లిళ్లు ఉండవు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎంతమందిని కనాలి అన్నది పూర్తిగా మహిళల ఇష్టమేనట. వాళ్లకి జీవితం మీద సాధికారతతోపాటు తమకు నచ్చినట్లుగా జీవించగల స్వేచ్ఛ ఉన్నాయి. అందుకే వాళ్లు సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారు.

పెళ్లి కాకుండా సహజీవనం చేయడం, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడం మనం ఇటీవల కాలం నుంచి వింటున్నాం. కానీ 1960వ దశకం నుంచే డెన్మార్క్‌ లో సహజీవనం, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడాన్ని చట్టబద్ధం చేశారు. పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. నమ్మించి మోసం చేశారన్న ప్రశ్నే రాదు.

అలాగే డెన్మార్క్‌ లో చిన్నప్పటి నుంచే పురుషులు, స్త్రీలు సమానమే అని అడుగడుగునా వివిధ సూక్తుల ద్వారా గుర్తు చేస్తుంటారు. స్కూల్‌ దశ నుంచే ఈ భావనను నూరిపోస్తారు. సమానత్వ శాఖకు మంత్రిని కూడా ఆ దేశం పెట్టుకుంది. అక్కడ స్త్రీ, పురుషులకు ఉద్యోగాల్లో సమాన హక్కులూ సమాన వేతనమూ అందిస్తారు. ప్రపంచంలో అధికశాతం(72) మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్న దేశం డెన్మార్క్‌ కావడం విశేషం.

డెన్మార్క్‌ ప్రజలకు సమానత్వం అంటే కేవలం లింగ సమానత్వమే కాదు. అన్ని అంశాల్లోనూ సమానత్వం ఉంటుంది. మతప్రమేయం లేని ఈ దేశంలో హోదాని బట్టో, సంపదని బట్టో కాకుండా అందరినీ సమానంగా గౌరవిస్తారు. మరే ఇతర వివక్షలూ లేవు.

ఇతర దేశాలతో పోలిస్తే లింగ సమానత్వాన్ని పాటించడం వల్ల డెన్మార్క్‌ లో స్త్రీలతో పాటు పురుషులూ లబ్ధి పొందుతున్నారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారని, సంతోషంగా ఉంటున్నారని సామాజికవేత్తలు చెబుతున్నారు.

అదేవిధంగా తమకు ఆరోగ్యం బాగోకపోయినా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం అక్కడి మహిళలకు లేదు. నిస్సంకోచంగా సెలవు పెట్టుకోవచ్చు. వ్యక్తిగతంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నవారికి ప్రభుత్వమే స్ట్రెస్‌ లీవ్‌ ఇవ్వడం డెన్మార్క్‌ ప్రత్యేకత.

ఇక డెన్మార్క్‌ పార్లమెంటులో ఏకంగా 43 శాతం మంది మహిళలే. అందులోనూ మళ్లీ 35 శాతం మహిళా మంత్రులే ఉన్నారు. ఇద్దరు మహిళలు డెన్మార్క్‌ ప్రధానులుగా పనిచేశారు.