Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు!

ఇందులో భాగంగా బస్సుల్లో సీట్ల కోసం జరుగుతున్న ఫైట్స్ కి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 1:11 PM GMT
ఆర్టీసీ బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు!
X

అటు కర్ణాటక, ఇటు తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించింది గ్యారెంటీలు అనేది తెలిసిన విషయమే. ఇందులో ప్రధానంగా "మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం" అనే హామీ బాగా ఆకర్షించిందని చెబుతుంటారు. అయితే... ఆ హామీ అమలులోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు తెరపైకి వచ్చాయి. అందులో... బస్సుల్లో గొడవలు ఒకటి!


అవును... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలులోకి వచ్చిన తర్వాత కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా బస్సుల్లో జరుగుతున్న రచ్చలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా బస్సుల్లో సీట్ల కోసం జరుగుతున్న ఫైట్స్ కి సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. పైగా ఇప్పటికే ఆక్యుపెన్సీ రేటు విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సిద్దిపేటలోని ఒక బస్సులో ఘర్షణ వాతావరణం చెలరేగింది.

వివరాళ్లోకి వెళ్తే... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు నిత్యం కిక్కరిసి పోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బస్సులో సీటు దొరకడం ప్రహసనంలా మారిపోయింది. ఈ క్రమంలో పలుచోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మధ్య సీటు విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు చెప్పులతో దాడిచేసుకోవడం గమనార్హం.

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నగర కేంద్రానికి బయల్దేరిన సమయంలో తొగుట మండలం వెంకట్రావు పేటకు వచ్చే సమయానికి బస్సు కిక్కిరిసిపోయింది. దీంతో.. చాలా మంది మహిళలకు సీట్లు దొరకలేదు. ఫలితంగా సీట్ల కోసం గొడవ జరిగింది. సీటు తమదంటే తమదంటూ మహిళలు గొడవకు దిగారు. ఈ మాటలు కాస్త తీవ్రమవడంతో ఇరువురు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాగా... మహాలక్ష్మీ పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 29 లక్షలు దాటుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఆక్యుపెన్సీ రేషియో గతంలో 69 శాతం ఉండగా... ఇప్పుడు సుమారు 89 శాతం నమోదవుతోందని ఘణాంకాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.