Begin typing your search above and press return to search.

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ఆటోవాలాకు దెబ్బేనా?

కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే.. చాలా విషయాల్లో రేవంత్ సర్కారు వాయు వేగంతో స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Feb 2024 6:38 AM GMT
ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ఆటోవాలాకు దెబ్బేనా?
X

కొన్ని విషయాల మీద ఓపెన్ గా మాట్లాడటం ఉండదు. ఎవరో ఏదో వాదన మొదలు పెడతారు. ఆ వాదనలో పస లేదని.. వారి డిమాండ్లలో న్యాయం లేదని తెలిసినా.. మనకెందుకులే అని మాట్లాడరు. అలా చూస్తుండిపోవటం కారణంగా రాజకీయ కుయుక్తులకు అవకాశంగా మారటాన్ని ఏమనాలి? తాజాగా తెలంగాణలో అలాంటిదే జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీదా ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకురావటం కొత్త అలవాటుగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంతో పోలిస్తే.. చాలా విషయాల్లో రేవంత్ సర్కారు వాయు వేగంతో స్పందిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు సరికాదని చెప్పాలి.

ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ఇవ్వటం తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంతనే మహిళలకు ఉచితంగా బస్సు జర్నీ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి కొందరు ఆటో డ్రైవర్లు.. తమకు గిరాకీ తగ్గిందంటూ మండిపడుతున్నారు. నిజంగానే వారికి గిరాకీ తగ్గిందా? అన్నది చూస్తే.. అందులో కాస్తంత న్యాయం ఉందని చెప్పాలి. కానీ.. వారు బతకలేనంత ఇబ్బంది ఉందా? అంటే లేదనే కచ్ఛితంగా చెప్పొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఆటో మీటర్లను అమలు చేస్తున్న ఆటో డ్రైవర్లు ఎంతమంది?

అసలు ఆటో మీటర్లు వేయటమే మానేసి చాలా కాలమే అయ్యింది. చివరకు ఆన్ లైన్ ఫ్లాట్ పాం మీద బుక్ చేసే ఆటోలకు సైతం కొన్ని సందర్భాల్లో అదనంగా డబ్బులు ఇస్తానంటేనే వస్తామని మొండికేసి ఆటో డ్రైవర్ల మాటేమిటి? తరచూ తమ కష్టాల గురించి మాట్లాడే ఆటో డ్రైవర్లు.. ఎప్పుడైనా ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులు.. వారికి ఎదురవుతున్న కష్టాలు.. నష్టాల గురించి మాట్లాడారా? ఆలోచించారా? రాత్రి అయితే చాలు విపరీతంగా రేట్లు పెంచేయటం.. వర్షం పడితే చాలు అదనంగా బాదేయటం.. తెల్లవారుజాము అయితే తమ కష్టానికి అదనంగా డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేయటం చూస్తున్నాం.

వీరి వాదనను ఒక ఉదాహరణతో పోల్చి చూద్దాం. పాల పాకెట్ ను తెల్లవారు జామున ఒక ధర.. ఉదయం వేళలో ఒక రేటు.. రాత్రి వేళలో ఒక రేటు.. అర్థరాత్రి దాటిన తర్వాత మరింత ఎక్కువ ధర అంటే ఒప్పుకుంటారా? పాల పాకెట్ తో ఆటో డ్రైవర్లను పోలుస్తారా? అంటే దాన్ని వదిలేద్దాం. రోడ్డు మీద ఉండే ఛాయ్ దుకాణం గురించి మాట్లాడుకుందాం. తెల్లవారుజాము నుంచి అర్థరాత్రి వరకు ఒకటే ధరకు టీ అమ్ముతారే తప్పించి.. వర్షం పడితే ఒక రేటు.. బాగా ఎండ కాస్తే ఇంకో రేటు అని పెట్టరు కదా? మరి.. ఆటోవాళ్లు అలా ఎందుకు అడుగుతారు? అని ప్రశ్నించారా? వారి తరఫు వారు ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ ఏమైనా ప్రకటన చేశారా? ఆటోల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా.. వారి ప్రవర్తన బాగోకున్నా వారి సంగతి తాము చూస్తామని ఏదైనా ఆటో సంఘం చెబుతుందా?

ఇక.. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఎందుకు వ్యతిరేకించాలన్నది చూస్తే.. మహిళలు.. వారికి ప్రత్యేకంగా కల్పించే వసతి పట్ల వివక్షతో ఉన్నారా? అన్న సందేహం కలుగక మానదు. విపక్ష బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ సైతం ఆటో సమస్య గురించి స్పందిస్తున్నారు. మరి.. అలా అయితే.. వారి ప్రభుత్వంలో కొందరికి మాత్రమే కొన్ని పథకాలు అమలు చేశారు కదా? మరి.. మిగిలిన వారు ఏం పాపం చేశారు? వారికి ఎందుకు అమలు చేయలేదు? అన్నది ప్రశ్న. గిరాకీ లేని కారణంగా ఆటోను తగలబెట్టుకున్నట్లుగా చెప్పిన ఆటో డ్రైవర్. సంచలనం కోసమో.. ప్రభుత్వాన్ని ఏదోలా ఇబ్బందికి గురి చేయటం.. ఇరుకున పడేయటమే ఎజెండాగా కొందరి తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.