Begin typing your search above and press return to search.

పబ్ లో పరిచయం.. డ్రగ్స్ కు బానిస చేశాడు ఆ తర్వాత..?

సంచలనంగా మారిన ఈ ఉదంతంలో ఒక బాధిత యువతి తనకు తాను బయటకు వచ్చి పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Feb 2024 9:30 AM GMT
పబ్ లో పరిచయం.. డ్రగ్స్ కు బానిస చేశాడు ఆ తర్వాత..?
X

నిజంగా నిజం. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం చూస్తే.. ఇటీవల కాలంలో డ్రగ్స్ ఎంతలా సామాన్యుల జీవితాల్లోకి వచ్చేశాయో అర్థమవుతుంది. తాజాగా ఒక మహిళ ఇచ్చిన సమాచారంతో టీఎస్ న్యాబ్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయటంతో పాటు వారి నుంచి రూ.25 లక్షల విలువైన పది గ్రాముల కొకైన్.. 13 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో మరో 16 మంది డ్రగ్స్ ను వినియోగించే వారి వివరాలు బయటకు వచ్చాయి. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో ఒక బాధిత యువతి తనకు తాను బయటకు వచ్చి పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.

పబ్ లో పరిచయమైన ఒక వ్యక్తి.. స్నేహం పేరుతో డ్రగ్స్ అలవాటు చేయటం.. ఆ తర్వాత ఆమెను బానిస చేసి వేధింపులకు గురి చేయటం.. దీంతో తట్టుకోలేని ఆమె చివరకు పోలీసుల్ని ఆశ్రయించటంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. యూసఫ్ గూడకు చెందిన సులేమాన్ తరచూ పబ్బులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో నిజాంపేటకు చెందిన ఒక మహిళ(మిథున కస్తూరి) అతడికి పరిచయమైంది. ఆమె భర్త కువైట్ లో ఉంటూ నెల వారీగా డబ్బులు పంపుతూ ఉంటాడు. ఆమె ఇక్కడ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడింది.

ఆమెతో పాటు సులేమాన్ కు రతన్.. సాహిల్.. ప్రియతో పాటు మరికొందరు పరిచయమయ్యారు. వీరంతా తరచూ పబ్బుల్లో కలుస్తూ డ్రగ్స్ తీసుకునేవారు. మరోవైపు ఇంకో మహిళతోనూ సులేమాన్ కు ఇదే తరహాలో స్నేహం ఉండేది. ఆమెను డ్రగ్స్ కు అలవాటు చేసిన సులేమాన్.. తర్వాత ఆమెను డ్రగ్స్ కు బానిసను చేయటమే కాదు.. వాటిని అమ్మాలంటూ ఒత్తిడి చేయటం.. డబ్బుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ చేయటం.. తన వ్యక్తిగత అవసరాలు తీర్చేందుకు డబ్బులు కావాలంటూ బెదిరింపులకు దిగటంతో ఆమె విసిగిపోయింది.

ఇప్పటికే తాను చాలా తప్పులు చేశానని.. రాబోయే రోజుల్లో మరిన్ని తప్పులకు అవకాశం ఇవ్వకూడదన్న ఆమె.. తెగించి.. తాను చిక్కుకున్న ఉచ్చు గురించి వివరాలు అందించేందుకు ఒక పోలీసు కానిస్టేబుల్ ను ఆశ్రయించింది. వారి సాయంతో ఆమె టీఎస్ న్యాబ్ పోలీసుల వద్దకు వెళ్లి జరిగిందంతా వివరించింది. ఈ క్రమంలో పక్కాగా ప్లాన్ చేసి.. ఈ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భారీ నెట్ వర్కు బయటకు వచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆమె తరహాలో మిగిలిన వారు స్పందించాల్సిన అవసరం ఉంది. మహానగరంలో డ్రగ్స్ ఎంత లోతుగా చొచ్చుకుపోయిందన్న విషయం తాజా ఉదంతం చూస్తే అర్థమవుతుంది.