Begin typing your search above and press return to search.

బీజేపీకి బిగ్ టెస్ట్.. ఇంకా 11 మంది కావాలి? ఇప్పుడెలా?

గత సమావేశాల్లో విపక్షం తరఫున గట్టిగా నిలబడిన టీఎంసీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రస్తుతం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

By:  Tupaki Political Desk   |   17 July 2026 1:30 PM IST
బీజేపీకి బిగ్ టెస్ట్.. ఇంకా 11 మంది కావాలి? ఇప్పుడెలా?
X

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ సమావేశాల్లో దేశభవిష్యత్తును నిర్ణయించే బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజార్టీ సాధించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోందని చెబుతున్నారు. ఇందులో భాగంగా విపక్షం ఇండి కూటమిలోని పలు ప్రధాన పార్టీలను టార్గెట్ చేసింది.

గత సమావేశాల్లో 2/3 వంతు మెజార్టీ లేక ఈ రెండు బిల్లులు వీగిపోయాయి. ఈ పరిణామాన్ని అవమానకరంగా భావించిన అధికార బీజేపీ పెద్దలు ఆ తర్వాత వ్యూహాత్మకంగా పావులు కదిపి విపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేశారు. గత సమావేశాల్లో విపక్షం తరఫున గట్టిగా నిలబడిన టీఎంసీ, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రస్తుతం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ తో విభేదాలతో డీఎంకే కూటమికి దూరమైంది. ఈ పరిణామాలు అన్నీ అధికార పార్టీకి కలిసివస్తున్నట్లు భావిస్తున్నా బిల్లుల ఆమోదానికి తగిన సంఖ్యాబలం ఇప్పటికీ సమకూరలేదని అంటున్నారు.

పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదానికి 2/3వ వంతు మెజార్టీ తప్పనిసరి. అంటే ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులు ఆమోదం పొందాలంటే 360 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ ప్రస్తుతం ఎన్డీఏకి కేవలం 293 మంది ఎంపీల బలమే ఉంది. ఇక మారిన రాజకీయ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ) నుంచి బయటకి వచ్చిన ఆరుగురు ఎంపీలు ఎన్డీఏకి మద్దతుగా నిలిస్తే అప్పుడు ప్రభుత్వం బలం సభలో 319కి చేరుతుందని అంటున్నారు. అదే సమయంలో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి చెందిన 8 మంది ఎంపీలు కూడా ప్రభుత్వానికి జై కొడితే మొత్తం బలం 327 అవుతోంది. అంటే అప్పటికీ ఇంకా 33 మంది ఎంపీలు మద్దతు అవసరం అవుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే ప్రభుత్వానికి మద్దతుగా నిలిస్తే మొత్తం బలం 349కి చేరుకుంటుందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో బిల్లులు ఆమోదానికి ఇంకా 11 మంది మద్దతు కూడగట్టాల్సివుందని అంటున్నారు. అయితే ఏపీకి చెందిన వైసీపీ బయటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల ఈ అంతరం ఏడుకి చేరింది. దీంతో కేంద్రం కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఇండిపెండెంట్లతోపాటు మరికొన్ని చిన్నపార్టీలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమత వెనుక ఉన్న ఎంపీలతోనూ చర్చలు సాగిస్తోందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ మహారాష్ట్ర వృద్ధ నేత శరద్ పవార్ నాయకత్వంలోని 8 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే సాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. కొన్ని రోజులుగా ఎన్సీపీ (ఎస్సీ) నేతలతో బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ వరుసగా చర్చలు జరుపుతున్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఇస్తామని చెబుతున్న ఎన్సీపీ (ఎస్పీ) డీలిమిటేషన్ బిల్లు విషయంలోనే మెలిక పెడుతోందని ప్రచారం జరుగుతోంది.

గడిచిన రెండు వారాలుగా ఎన్సీపీ (ఎస్పీ) నేతలతో కేంద్రం తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ఇతర సీనియర్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నా ఇప్పటివరకు క్లారిటీ లభించలేదని అంటున్నారు. దీంతో కేంద్రం మరికొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రానున్న రెండుమూడు రోజుల్లో ఏం జరగనుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ నెల 20న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా, మెజార్టీపై నమ్మకం కలిగిన వెంటనే బిల్లులు లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.