Begin typing your search above and press return to search.

అవినీతిలోనూ మహిళలు ముందుకే... ఇదిగో తాజా ఉదా!

అన్ని విషయాల్లోనూ మగాళ్లతో మహిళలు పోటీ పడుతున్నారనే విషయం ఎప్పటినుంచో వింటున్నదే.

By:  Tupaki Desk   |   19 July 2025 11:03 PM IST
అవినీతిలోనూ మహిళలు ముందుకే... ఇదిగో తాజా ఉదా!
X

అన్ని విషయాల్లోనూ మగాళ్లతో మహిళలు పోటీ పడుతున్నారనే విషయం ఎప్పటినుంచో వింటున్నదే. కొంతకాలంగా అది చాలా విషయాల్లో నిరూపణ అయ్యింది కూడా. ప్రస్తుత సమాజంలో మగాళ్లు, మహిళలు అనే తారతమ్యాలేవీ లేవు. అన్ని పనుల్లోనూ, అన్ని అవకాశాల్లోనూ ఇద్దరూ సమానంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా అవినీతిలోనూ తగ్గడం లేదనే విషయం తెరపైకి వచ్చింది.

అవును.. అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని ఇప్పటికే ఎందరో మహిళలు నిరూపించారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు ఉద్యోగాల్లోనూ, క్రీడల్లోనూ, అంతరిక్ష రంగంలోనూ దూసుకుపోతున్నారు. అంతేకాదు సుమా... తాజాగా అవినీతిలోనూ కొంతమంది మహిళలు ముందుకు కదులుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని ఏసీబీ దాడులు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పాయి!

ఈ ఏడాది ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరిపిన దాడుల్లో 18 మంది మహిళా అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో వేల రూపాయల నుంచి లక్షల్లో డిమాండ్ చేసినవారు ఉన్నారని అంటున్నారు! ఇక.. పురుషుల్లో ఇప్పటికే 100 మందికి పైగా అధికారులను ఏసీబీ పట్టుకుంది!

ఈ క్రమంలో తాజాగా మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం, బీమా మంజూరు చేసేందుకు లంచాలివ్వాలంటూ కొందరు కార్మికశాఖ అధికారులు వేధిస్తున్న విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... బెల్లంపల్లికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నరాల శంకర్‌ గతేడాది ఏప్రిల్‌ లో చనిపోగా.. లేబర్‌ కార్డు ఉండటంతో రూ.1.30 లక్షల నష్టపరిహారం కోసం ఆయన భార్య మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని బెల్లంపల్లిలో సహాయ కార్మికశాఖ అధికారిని ని కలిశారు.

ఈ సమయంలో... నష్టపరిహారం మంజూరు చేయాలంటే రూ.40 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. పైగా డబ్బులు తనకు ఇవ్వొద్దని, సమీపంలోని పార్కులో తన సహాయకురాలుకి అందజేయాలని సూచించారు. దీంతో... బాధితురాలు ఈ నెల 8న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడ బాధితురాలి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా సహాయకురాలిని, అనంతరం సంబంధిత అధికారిని ఏసీబీ పట్టుకుంది.

ఈ నేపథ్యంలో లంచాలు తీసుకునే విషయంలో మహిళా అధికారులు కూడా ఏమాత్రం తగ్గడం లేదనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. భర్త చనిపోయిన మహిళ అనే జాలి కూడా ఆ మహిళా అధికారినికి లేకుండా పోయిందే అని అంటున్నారు నెటిజన్లు!