మత్తు ముఠాల చేతుల్లో మహిళలు.. 7 నెలల్లో 100 మందికి కౌన్సెలింగ్
సిగరెట్, మద్యం, గుట్కా వీటి స్థాయి దాటిపోయింది.. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడీస్తున్న వ్యసనాల్లో డ్రగ్స్, గంజాయి ప్రధానంగా మారాయి.
By: Tupaki Desk | 22 Aug 2025 10:46 PM ISTసిగరెట్, మద్యం, గుట్కా వీటి స్థాయి దాటిపోయింది.. ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడీస్తున్న వ్యసనాల్లో డ్రగ్స్, గంజాయి ప్రధానంగా మారాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, రుణాలిచ్చే యాప్‌లను మించి వ్యవస్థకు పట్టిన చీడ పురుగులా మారాయి ఈ మత్తు పదార్థాలు. సిగరెట్, మద్యం వంటి వ్యసనాలను ఎప్పుడైనా వదులుకుంటారని భావించవచ్చేమో కానీ.. డ్రగ్స్ మాత్రం దాని బానిసలనే లోకం వదిలేలా చేస్తుంది..! ఇక మొన్నటివరకు పురుషులు, యువత మాత్రమే డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతున్నారని భావిస్తుండగా ఇప్పుడు మహిళలు, యువతుల సంఖ్య కూడా తక్కువ కాదని తెలుస్తోంది.
పరిస్థితుల ప్రభావమో..మరే కారణమో..?
హైదరాబాద్‌లో ఈ ఏడాది ఏడు నెలల్లో డ్రగ్స్, గంజాయి కొనుగోలుదారుల్లో 100 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. ఉపాధి, ఉద్యోగాల అన్వేషణలో నగరానికి వచ్చేవారిని మత్తు ముఠాలు టార్గెట్ చేస‍్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా వల వేసి, భారీ కమీషన్ ఆశ చూపి పెడ్లర్లుగా మార్చుకుంటున్నాయి. ఇలా వారంతా మత్తు ముఠాల చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. ఇటీవల మెడికల్ కాలేజీలో గంజాయి తాగుతూ కొందరు మెడికోలు పట్టుబడగా అందులో ముగ్గురు యువతులు ఉన్నారు.
మంచి హోదాల్లో ఉన్న మహిళలూ...
ఆ మధ్య హైదరాబాద్‌లోని పెద్ద ఆస్పత్రి వైద్యుడి కుమార్తె, స్వయంగా వైద్యురాలైన మహిళ డ్రగ్స్‌కు బానిసైన సంగతి బయటకు వచ్చింది. ఇలా సమాజంలో మంచి హోదాల్లో ఉన్న మహిళలూ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ఐటీ ఉద్యోగిని పెళ్లయిన ఏడాదికే విడాకులు తీసుకుని, బంధువులు, స్నేహితులు తప్పు నీదే అని నిందించడంతో కుంగుబాటుకు గురైంది. ఆఫీసులో కొలీగ్ నుంచి డ్రగ్స్‌కు అలవాటైంది. హైదరాబాద్‌కు చెందిన మహిళ రూ.3 కోట్ల విలువైన గంజాయి తీసుకొస్తూ విమానాశ్రయంలో దొరికింది. ఏపీ నుంచి వచ్చి ఐటీ జాబ్ చేస్తున్న యువతి కూడా గంజాయి వాడడం మొదలుపెట్టింది.
వీరే కాదు.. జీహెచ్‌ఎంసీలో హెచ్‌న్యూ, ఈగలపోలీసులకు పట్టుబడుతున్న డ్రగ్స్ అమ్మేవారి ఫోన్లు తనికీ చేస్తే యువతుల నంబర్లు కనిపిస్తున్నాయి. కొందరైతే పార్టీల్లో ఫ్రెండ్స్ బలవంతంతో డ్రగ్స్‌కు అలవాటు అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
పట్టుబడ్డాక డీ అడిక‌్షన్ కేంద్రాలకు..
ఏపీకి చెందిన యువతి తాను చేసిన తప్పును తెలుసుకుని డీఅడిక‌్షన్ కేంద్రంలో చేరింది. అయితే, చాలా కొద్దిమంది మాత్రమే ఇలా ముందుకొస్తున్నారు. చాలామంది గుట్టుగా వ్యసనాన్ని కొనసాగించేందుకే ప్రయత్నిస్తున్నారు. మత్తు పదార్థాలు శరీరాన్ని కుంగదీస్తాయి. మనలో పనితీరును మందగించేలా చేస్తాయి. చివరకు వ్యక్తిగతంగా పతనం చేస్తాయి. దీనిని తెలుసుకోలేనివారు చివరకు అన్నివిధాలుగా నష్టపోతారు.
