Begin typing your search above and press return to search.

నడుచుకుంటూ వెళుతుంటే.. రేవంతన్నా అన్న మహిళ పిలుపుతో..

గతంలో మాదిరి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి లాంటి వారు ఎక్కడికైనా వస్తున్నా.. వెళుతున్నా ఆ దరిదాపుల్లో ఎవరూ లేకుండా చేయటం ఒక అలవాటుగా మారింది.

By:  Tupaki Desk   |   11 Dec 2023 6:19 AM GMT
నడుచుకుంటూ వెళుతుంటే.. రేవంతన్నా అన్న మహిళ పిలుపుతో..
X

గతంలో మాదిరి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి లాంటి వారు ఎక్కడికైనా వస్తున్నా.. వెళుతున్నా ఆ దరిదాపుల్లో ఎవరూ లేకుండా చేయటం ఒక అలవాటుగా మారింది. అయితే.. ఇలాంటి రోజుల్లో కూడా అందుకు భిన్నంగా వ్యవహరించే ముఖ్యమంత్రులు ఉన్నారన్న భావన కలిగేలా చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్. తాజాగా జరిగిన పరిణామం గురించి తెలిసిన వారంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తీరును కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.

అందరి మనసు దోచుకుంటున్న వైరల్ వీడియో వివరాల్లోకి వెళితే.. ఫాంహౌస్ బాత్రూంలో కాలుజారి పడి.. శస్త్ర చికిత్స జరిగిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను యశోదా ఆసుపత్రిలో పరామర్శించేందుకు వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన యోగక్షేమాల గురించి తెలుసుకున్న రేవంత్.. తిరిగి వెళుతున్న వేళ.. ఆసుపత్రి కారిడార్ లో ఒక మహిళ.. రేవంతన్నా మీతో మాట్లాడాలని పెద్దగా పిలిచారు. ఆ వెంటనే.. సెక్యూరిటీ సిబ్బంది స్పందిస్తున్న వేళ.. వారిని వారించిన సీఎం రేవంత్ వారిని అక్కడే ఆగమని చెప్పి.. తాను నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్లారు.

తన బిల్ చాలా అధికంగా ఉందని.. రోజుకు రూ.లక్షన్నర ఛార్జ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదన్న ఆమె వేదనకు స్పందించిన ముఖ్యమంత్రి.. ‘‘సార్ కొంచెం చూడండి’’ అంటూ ఆసుపత్రి అధికారుల్ని కోరారు. వారు సానుకూలంగా స్పందించినట్లుగా చెబుతున్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఎదుటి వారిని ఉద్దేశించి మాట్లాడే వేళలో.. ఆర్డర్ గా కాకుండా.. ‘సార్ చూడండి’ అంటూ మాట్లాడిన తీరు అందరిని ఆకర్షిస్తోంది. అదే సమయంలో.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీగా వసూలు చేస్తున్న వైనం మరోసారి చర్చకు వచ్చినట్లైంది.