Begin typing your search above and press return to search.

ఆర్డర్‌ పెట్టకుండానే వందల పార్శిళ్లు.. విషయం తెలిస్తే అయ్యో పాపం అంటారు!

ఇందులో భాగంగా... ఆరోజు నుంచి మొదలు నిత్యం అటువంటి పార్శిళ్లు రావడం మొదలైంది. దీంతో... వందల సంఖ్యలో బాక్సులు తన ఇంటి ముందు పోగుపడ్డాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 3:00 AM IST
ఆర్డర్‌  పెట్టకుండానే వందల పార్శిళ్లు.. విషయం తెలిస్తే అయ్యో పాపం అంటారు!
X

ఆన్ లైన్ లో పెట్టిన ఆర్డర్ సమయానికి రాకపోతే చాలా మందికి ఎలాగైతే బీపీ పెరిగిపొతుందో.. అసలు ఆర్డర్ పెట్టకుండానే ఓ పార్శిల్ డెలివరీ వస్తే వారి పరిస్థితి తొలుత ఆలోచన, అనంతరం టెన్షన్ కి దారి తీస్తుంది. అలంటిది ఆర్డర్స్ పెట్టకుండానే వందల కొద్దీ పార్శిళ్లు రోజూ వస్తుంటే.. రిజక్ట్ చేసినా మళ్లీ మళ్లీ వస్తుంటే..! తాజాగా ఓ మహిళకు ఇదే జరిగింది.

అవును... కాలిఫోర్నియాకు చెందిన "కే" అనే మహిళకు సుమారు ఏడాది క్రితం ఆర్డర్ చేయకుండానే ఓ పార్శిల్‌ వచ్చింది. అయితే.. అదేదో తప్పుడు చిరునామాకు వచ్చినట్లు భావించిన ఆమె ఆ పార్శిల్ ని పక్కన పడేసింది. పాపం అంతం కాదిది ఆరంభం అనే విషయం అప్పుడు ఆమెకు తెలియదు. అక్కడ నుంచి వరుసగా ఆమె ఇంటివద్దకు పార్శిళ్ల వర్షం కురిసింది.

ఇందులో భాగంగా... ఆరోజు నుంచి మొదలు నిత్యం అటువంటి పార్శిళ్లు రావడం మొదలైంది. దీంతో... వందల సంఖ్యలో బాక్సులు తన ఇంటి ముందు పోగుపడ్డాయి. అది ఎంతలా అంటే... చివరికి తన నివాసం మెట్లు కూడా కనిపించని స్థితి.. కారు నిలిపేందుకు పార్కింగ్ స్థలం కూడా లేని పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో అమెజాన్ కు ఆమె కనీసం ఆరుసార్లు ఫిర్యాదు చేశారు.

అసలు విషయం ఏమిటంటే... ఆ పార్శిల్ బాక్సులు మొత్తం చైనాకు చెందిన లియాశాండేడియన్‌ అనే కారు సీట్‌ కవర్ల తయారీ కంపెనీవి. దాని ఉత్పత్తులు నాసిరకంగా ఉంటున్నాయంటూ.. సదరు వినియోగదారులు వాటిని తిప్పిపంపేస్తుంటే... ఆ సంస్థ రిటర్న్‌ అడ్రస్‌ కాలిఫోర్నియాలోని శాన్‌ జోస్‌ లోని "కే" ఇంటి చిరునామా ఇచ్చింది! దీంతో అవి ఆమె ఇంటికి రావడం మొదలైంది.

ఈ సందర్భంగా తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె... తాను చాలా పార్శిళ్లు స్వీకరించేందుకు నిరాకరించానని, అవి కాకుండా వచ్చినవే ఇంటి ముందున్న పార్శిల్స్ అని ఆమె వెల్లడించింది. ఒక దశలో ఆ పార్శిళ్లను డొనేట్‌ చేయడం లేదా పారవేయడం చేస్తే 100 డాలర్లు ఇస్తానని అమెజాన్‌ ఆఫర్‌ చేసినట్లు ఆమె వెల్లడించింది.

ఈ విషయం మీడియాలో రావడంతో బుధవారం అమెజాన్‌ బృందం ఆమె ఇంటికి చేరుకొంది. అనంతరం ఆ బాక్సులు అన్నింటినీ తొలగించింది. మరోసారి పార్శిళ్లు అక్కడకు రాకుండా చూసుకొంటామని హామీ ఇచ్చింది. దీంతో.. ఆమె మెట్ల నుంచి ఇంటిలోకి ఇబ్బంది లేకుండా వెళ్తుంది.. కారును ఈజీగా పార్క్ చేస్తుంది.