ఇదో విచిత్రం.. 45 ఏళ్ల భార్యకు 21 ఏళ్ల ప్రియుడితో పెళ్లి చేసిన భర్త!
జార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా ఘాఘర్‌జానీ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 21 Jun 2025 1:00 AM ISTజార్ఖండ్‌లోని పాకుర్ జిల్లా ఘాఘర్‌జానీ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది చదివినవారెవరికైనా నమ్మశక్యం కానిది. 45 ఏళ్ల ఓ మహిళకు ఆమెకంటే సగం వయస్సున్న 21 ఏళ్ల యువకుడితో ప్రత్యక్షంగా పంచాయతీ ఎదుటే పెళ్లి చేసిచెప్పిన సంఘటన ఇది.
వివరాల్లోకి వెళితే.. ఆ గ్రామానికి చెందిన ఓ వివాహిత, తన భర్తతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తోంది. కానీ గత కొంతకాలంగా ఆమె ఓ 21 ఏళ్ల యువకుడితో గాఢ సంబంధం కొనసాగిస్తోంది అనే విషయం భర్తతోపాటు గ్రామస్థులకూ తెలిసిపోయింది. ఈ వ్యవహారం రోజురోజుకూ ఊహించని దిశలో సాగుతుండటంతో పంచాయతీ పిలిపించి సభ ఏర్పాటు చేశారు.
అక్కడే తన భార్యకు సంప్రదాయ ప్రకారం విడాకులు ఇచ్చిన భర్త, ఆమె నుదుటి సింధూరాన్ని తుడిచాడు, చేతిలోని గాజులను తీసేశాడు. అనంతరం ఆమెను ఆమె ప్రియుడికి పెళ్లిచేసి ఇచ్చాడు. ఆ వివాహం అక్కడే పంచాయతీ సమక్షంలో జరిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బయటపడటంతో ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై గ్రామస్థులు మాట్లాడుతూ.. "ఇంత పెద్ద వయస్సులో ఇద్దరు పిల్లలు ఉన్న మహిళ ఇలాంటి పని చేయడం సరికాదు.. ఆమెకు శిక్ష విధించాలి" అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం "భర్త అత్యంత పరిపక్వతతో వ్యవహరించాడు. గొడవలు, పోలీస్ కేసులు సహా అన్నీ తప్పించుకుని సూటిగా, శాంతియుతంగా సమస్యకు పరిష్కారం చూపించాడు" అని అంటున్నారు.
ఈ సంఘటన "మానవ సంబంధాలు ఎంతలా మారిపోతున్నాయో.. పెళ్లి, బంధాలు, కుటుంబాల విలువలు ఎలా తరిగిపోతున్నాయో" అని చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు వివాహేతర సంబంధాలు బహిరంగం అయితే పంచాయతీ తీర్పు, పోలీస్ కేసులు మామూలే. కానీ ఇక్కడ భర్తనే స్వయంగా తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై విభిన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సమాజం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
