రైలు పట్టాలపై పండంటి బిడ్డ.. జబల్‌పూర్ స్టేషన్‌లో అద్భుతం!
ఆ తర్వాత కోచ్ అటెండర్ తర్వాత రైల్వే స్టేషన్ అయిన జబల్‌పూర్‌కు విషయాన్ని చేరవేశాడు. రైలు స్టేషన్‌కు చేరుకునే సమయానికి అంబులెన్స్ రెడీగా ఉంది.
By: Tupaki Desk | 11 May 2025 12:00 PM ISTమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. బెంగళూరు నుంచి దానాపూర్ వైపు వెళ్తున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక బోగీలో ప్రయాణిస్తున్న మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుండగా, అక్కడి సిబ్బంది, వైద్య సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. రైలు ఆగగానే ప్లాట్‌ఫారమ్‌పైనే ఆమెకు సురక్షితంగా ప్రసవం చేశారు. పండంటి బిడ్డ పుట్టగానే అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి అభినందించారు.
బీహార్‌లోని మోతిహారికి చెందిన మీనా కుమారి బెంగళూరు నుంచి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఉండగానే ఆమెకు ప్రసవ నొప్పి మొదలైంది. నొప్పి ఎక్కువ కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కోచ్ అటెండర్‌కు సమాచారం అందజేశారు. ఆ తర్వాత కోచ్ అటెండర్ తర్వాత రైల్వే స్టేషన్ అయిన జబల్‌పూర్‌కు విషయాన్ని చేరవేశాడు. రైలు స్టేషన్‌కు చేరుకునే సమయానికి అంబులెన్స్ రెడీగా ఉంది.
ప్లాట్‌ఫారమ్‌పై ప్రసవం
రైలు ఆగగానే రైల్వే సిబ్బంది వెంటనే మహిళను బోగీ నుంచి కిందకు దించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో 108 అంబులెన్స్‌కు చెందిన డాక్టర్ అమర్‌నాథ్, అతని బృందం అక్కడికక్కడే ఒక తెర చాటును ఏర్పాటు చేశారు. అనంతరం ప్లాట్‌ఫారమ్‌పైనే మహిళకు సేఫ్‌గా ప్రసవం చేశారు. మహిళ ఒక ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అంబులెన్స్ సహాయంతో తల్లి, బిడ్డను రాణి దుర్గావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
చప్పట్లతో స్వాగతం
జీఆర్‌పీ సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీవని రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ప్రజల సహకారం, సంయమనం వల్లే మహిళకు సురక్షితంగా ప్రసవం చేయగలిగామని తెలిపారు. మహిళను రైలు నుంచి దించిన చాలాసేపటి వరకు రైలు స్టేషన్‌లోనే ఆగి ఉంది. ప్రసవం తర్వాత మహిళను ఆసుపత్రికి తరలించిన వెంటనే రైలు కూడా తన గమ్యస్థానానికి బయలుదేరింది. మహిళకు సురక్షితంగా ప్రసవం జరగడంతో రైలు ప్రయాణికులు చప్పట్లు కొట్టి అభినందించారు.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు. ఈ విధంగా మానవత్వం చూపినందుకు ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
