Begin typing your search above and press return to search.

టమాటో తోటలో ఉద్యోగం.. నెలకు రూ.12 వేల జీతం + సౌకర్యాలు : మహిళా రైతు వీడియో వైరల్

ఒకప్పుడు పల్లెటూళ్లలో వ్యవసాయ పనుల కోసం ఎంతో మంది పోటీపడేవారు, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది.

By:  Tupaki Political Desk   |   9 July 2026 9:09 PM IST
టమాటో తోటలో ఉద్యోగం.. నెలకు రూ.12 వేల జీతం + సౌకర్యాలు : మహిళా రైతు వీడియో వైరల్
X

టమోటా తోటలో పని కోసం ఓ మహిళా రైతు ట్విటర్ (ఎక్స్) వేదికగా చేసిన ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. వ్యవసాయ పనుల కోసం కూలీలు దొరకడం కష్టతరమైన ఈ రోజుల్లో మహిళా రైతు కార్పొరేట్ కంపెనీ తరహాలో ఉద్యోగ ప్రకటన చేయడం ఆకట్టుకుంటోంది. పని వేళలు, ఆకర్షణీయమైన జీతం, అదనపు సౌకర్యాలను వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన వీడియో గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పనులకు ఎంతటి సమస్యలు ఎదురవుతున్నాయనేది అద్దం పడుతోందని అంటున్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీల కొరత ఎంత తీవ్రంగా ఉందనే విషయాన్ని ఈ ప్రకటన తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు పల్లెటూళ్లలో వ్యవసాయ పనుల కోసం ఎంతో మంది పోటీపడేవారు, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. గ్రామీణ యువత ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లడం, చదువుకున్న వారు వ్యవసాయ పనులను చిన్నచూపు చూడటం వంటి కారణాలతో రైతులు కూలీల కోసం అన్వేషించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కొరతను అధిగమించేందుకు మహిళా రైతు వినూత్నంగా ఆలోచించి, సోషల్ మీడియాలో ఉద్యోగ ప్రకటన చేయడం విశేషం.

సరదాగా మహిళా రైతు వీడియో చేసినా, తన పొలంలో పని వారి కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆమె చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. నెలకు రూ. 12,000 జీతం ఇవ్వడమే కాకుండా, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని వేళలు ఉంటాయని, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే వేడి వేడి టీ, మధ్యాహ్నం 12 గంటలకు చల్లని కూల్ డ్రింక్ ఉచితంగా అందిస్తామని ఆమె ఆఫర్ చేయడంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేవలం జీతమే కాకుండా తోటలో పండే తాజా కూరగాయలు, ఆకుకూరలు, మామిడికాయలు వంటివి కూడా ఉచితంగా ఇస్తామని చెప్పడం విశేషం.

పనిలో నాణ్యత కోసం ఆమె తీసుకున్న నిర్ణయం మరో విశేషంగా చెబుతున్నారు. మొక్కలు నాటడం, పురి కట్టడం, కాయలు కోయడం వంటి పనులపై మొదట నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. సరైన అవగాహన లేకపోతే చెట్ల కొమ్మలు విరగడం, పచ్చికాయలను కోసేయడం వంటి నష్టాలు జరుగుతాయని, అందుకే ఈ శిక్షణ తప్పనిసరి అని ఆమె వివరించారు. అంతేకాదు, పనితో పాటు వినోదాన్ని కూడా జోడిస్తూ, వచ్చే ఆదివారం చికెన్, పూరీ, రాగి సంగటితో తమ బావమ్మ గ్రాండ్ డిన్నర్ ఇస్తున్నారని, తన ఫాలోవర్స్ అందరూ రావచ్చని ఆహ్వానం పలకడం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారితో పోలిస్తే ఈ ఆఫర్ ఎంతో మెరుగ్గా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నగరాల్లో ఎంతో మంది రూ. 6,000 నుండి రూ. 10,000 జీతం కోసం 12 నుండి 15 గంటల పాటు కష్టపడుతున్నారు. అందులో ప్రయాణ ఖర్చులు, నగరంలో పెరుగుతున్న జీవన వ్యయాలతో వారి చేతికి మిగిలేది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో, సొంత ఊరిలో, కుటుంబంతో ఉంటూ, గౌరవప్రదమైన జీతం పొందే అవకాశం లభించడం గొప్ప విషయమని అభిప్రాయపడుతున్నారు. మహిళా రైతు చేసిన ఈ ప్రయత్నం వ్యవసాయాన్ని లాభదాయకమైన గౌరవప్రదమైన వృత్తిగా మార్చే దిశగా ఒక అడుగుగా నిలుస్తోందని అంటున్నారు.