భర్త గడ్డం నచ్చక మరిదితో వెళ్లిపోయిన వదిన
ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఉదంతాలు అనుబంధాల మీద కొత్త అనుమానాల్ని రేకెత్తించేలా చేస్తున్నాయి.
By: Tupaki Desk | 1 May 2025 9:31 AM ISTఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఉదంతాలు అనుబంధాల మీద కొత్త అనుమానాల్ని రేకెత్తించేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గడ్డంతో ఉన్న భర్తను.. క్లీన్ షేవ్ లో ఉండాలని కోరగా.. సదరు భర్త నో అంటే నో అని తేల్చేయటం ఒక ఎత్తు అయితే.. అందుకు బదులుగా సదరు భార్య తన భర్త తమ్ముడితో వెళ్లిపోయిన వైనం సంచలనంగా మారింది. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ లోని లిసాడి గేట్ ప్రాంతానికి చెందిన మౌలానా షకీర్ అనే యువకుడికి ఆర్షి అనే యువతితో ఆర్నెల్ల క్రితం పెళ్లైంది. ఆర్షి ఇంటర్ వరకు చదువుకొని.. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. తొలి రోజే భర్త గడ్డం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు షకీర్ స్పందిస్తూ.. తన భార్య కోరినట్లుగా తన గడ్డాన్ని తీసే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఇదే అంశంపై కొత్త జంట మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
ఇదిలా ఉంటే.. షకీర్ ప్రతి రోజు ఉదయం తన పని కోసం బయటకు వెళ్లిపోయిన తర్వాత.. ఇంట్లో అతడి తల్లి.. సోదరుడు ఉండేవారు. ఈ క్రమంలో క్లీన్ షేవ్ లో ఉండే షకీర్ సోదరుడితో ఆమె చేరువైంది. అంతేకాదు.. తాజాగా వారిద్దరూ ఎటో వెళ్లిపోయారు. ఈ ఉదంతం నేపథ్యంలో ఆర్షి తల్లిదండ్రులకు భర్త ఫిర్యాదు చేయటంతో పాటు.. ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం ఉందని తేల్చేవారు. అంతేకాదు.. పోలీసులకు షకీర్ కంప్లైంట్ ఇవ్వటంతో ఇద్దరు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
