కరెంటే కాదు.. దాని బిల్లు కూడా షాక్ కొట్టుద్ది.. నిండు ప్రాణం బలి
ఆగ్రాలో చికిత్స పొందుతూ ప్రేమలత మరణించింది. ఈ ఘటన తర్వాత ఆమె పిల్లలు అనాథలు అయ్యారు.
By: Tupaki Desk | 11 May 2025 1:00 PM ISTఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కేవలం రూ.1100 బిల్లు చెల్లించలేదని ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె ఇంటి విద్యుత్ మీటర్‌ను తీసుకెళ్లడంతో షాక్‌కు గురైన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పేదరికంతో పోరాడుతున్న ఆ తల్లిని విద్యుత్ సిబ్బంది మానవత్వం లేకుండా చేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఫిరోజాబాద్‌లోని థానా ఉత్తర్‌కు చెందిన నగ్లా కరణ్ సింగ్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రేమలత (41) విద్యుత్ సిబ్బందితో జరిగిన వివాదం తర్వాత మరణించింది. ఆమె భర్త గతంలోనే మరణించాడు. ప్రేమలత ఒంటరిగా తన ఐదుగురు పిల్లలను గాజుల తయారు చేసి తద్వారా పోషించుకుంటుందని స్థానికులు తెలిపారు. శనివారం పురుషోత్తమ్ విహార్ విద్యుత్ ఫీడర్ నుంచి కొంతమంది సిబ్బంది ఆమె ఇంటికి వచ్చారు. గత రెండు నెలలుగా బకాయి ఉన్న రూ.1100 బిల్లు గురించి ఆమెతో దురుసుగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఆ తర్వాత వారు ఆమె ఇంటి విద్యుత్ మీటర్‌ను తీసుకెళ్లాలని అన్నారు. మీటర్‌ను తీసుకెళ్లవద్దని ప్రేమలత విద్యుత్ సిబ్బందిని చాలా ప్రాధేయపడింది. కానీ వారు వినిపించుకోలేదు. చాలాసేపు వారిని వేడుకుంటూ కొన్ని రోజుల గడువు కోరింది. కానీ వారు వినకుండానే మీటర్‌ను తీసుకెళ్లారు. తన పరువు పోయిందని ఆ మహిళ ఏడుస్తూ స్పృహ తప్పి నేలపై పడిపోయింది. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి తర్వాత ఆగ్రాకు రెఫర్ చేశారు.
చికిత్స పొందుతూ మృతి
ఆగ్రాలో చికిత్స పొందుతూ ప్రేమలత మరణించింది. ఈ ఘటన తర్వాత ఆమె పిల్లలు అనాథలు అయ్యారు. ఈ విషయం గురించి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాగేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఆ మహిళ తన ఇంటి చివరి విద్యుత్ బిల్లును డిసెంబర్ 2023లో చెల్లించిందని తెలిపారు. ఐదు నెలల క్రితం ఆమె ఇంటి నుండి స్మార్ట్ మీటర్ కనెక్షన్ తొలగించారు. ఆ తర్వాత కూడా ఆమె బిల్లు చెల్లించకపోవడంతో కనెక్షన్ మూసివేయడానికి ఒక బృందం వెళ్లిందని చెప్పారు. అందుకే మీటర్‌ను తొలగించారు. అయితే, ఈ మొత్తం విషయంపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విచారణ జరుపుతామని తెలిపారు.
