మరో వివాదంలో ఎమ్మెల్సీ అనంతబాబు! డోర్ డెలవరీ కేసులో ట్విస్టు!
డ్రైవర్ హత్యతోపాటు మృతదేహం డోర్ డెలవరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు.
By: Tupaki Political Desk | 22 April 2026 12:41 PM ISTడ్రైవర్ హత్యతోపాటు మృతదేహం డోర్ డెలవరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. హత్య కేసులో సాక్ష్యులను బెదిరించినట్లు ఆయనపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబరులోగా విచారణ ముగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 24న ట్రైల్ ప్రారంభమవుతుందని అనుకుంటుండగా, కేసు కీలక మలుపు తిరిగింది.
డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు సాక్ష్యులను బెదిరించినట్లు పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి నలుగురు సాక్ష్యులను పిలిపించుకుని బెదిరించారని, ప్రలోభాలకు గురిచేశారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించగా, నలుగురు సాక్ష్యులను బెదిరించిన ఉదంతం బయట పడిందని చెబుతున్నారు.
సాక్ష్యుల నుంచి పోలీసులు సమాచారం సేకరించగా, డిఫెన్స్ న్యాయవాది చెప్పినట్లు చెప్పాలని ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన అనుచరులు తమపై ఒత్తిడి చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు. తాము చెప్పినట్లు నడుచుకుంటే ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఇస్తామని బేరం కుదుర్చుకున్నారని, అడ్వానుసుగా తలా లక్ష రూపాయలు ముందుగా చెప్పారని సాక్ష్యులు పోలీసులకు చెప్పారని అంటున్నారు. ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అదుపులోకి తీసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లగా, ఆయన అప్పటికే పరారయ్యారని అంటున్నారు.
డ్రైవర్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న అనంతబాబు తాజా కేసుతో మరిన్ని చిక్కులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా హత్య కేసులో సాక్ష్యులను ప్రలోభాలకు గురిచేయకూడదని, వారితో మాట్లాడం చేయడం కూడా నేరమని బెయిలు షరతల్లో స్పష్టంగా ఉంటుందని, కానీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ షరతులను ఉల్లంఘించేలా నడుచుకోవడంతో భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి రావొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తగ్గట్టే ఆయన బెయిలు రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేసేందుకు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హత్య కేసులో సాక్ష్యులను బెదిరించారని ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. అసలే కూటమి ప్రభుత్వం టార్గెట్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇలాంటి పొరపాటు ఎలా చేస్తారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బెయిలు రద్దు అవుతుందని తెలిసి మరీ సాక్ష్యులతో మాట్లాడే ప్రయత్నం చేయడమే హాట్ టాపిక్ అవుతోంది. న్యాయ శాస్త్రం చదువుకున్న అనంతబాబు అన్నీ తెలిసి అడ్డంగా బుక్కయిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజా ఉదంతంతో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మరోమారు రాష్ట్రంలో హాట్ డిబేట్ గా మారిందని అంటున్నారు.
