Begin typing your search above and press return to search.

తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి పక్ష నేతను తేల్చరా?

కానీ, సభలో మూడో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇప్పటివరకు తమ శాసన సభ పక్షా నేత ఎవరో తేల్చలేకపోయింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:30 AM GMT
తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీకి పక్ష నేతను తేల్చరా?
X

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలుల దాటింది. రెండోసారి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇవి కీలకమైన బడ్జెట్ సమావేశాలు. అన్ని పార్టీలు తమ శాసనసభా పక్ష నాయకుడు ఎవరో తేల్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమదైన తరహా ప్రజా పాలనతో ముందుకెళ్తోంది. హ్యాట్రిక్ ఖాయమంటూ బరిలో దిగిన బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోవడంతో కంగుతిన్నది. అయితే.. పార్లమెంటు ఎన్నికలకు సమీక్షలు కూడా చేసేసింది. ఇక అసెంబ్లీకి వస్తూ తమదైన శైలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఎంఐఎం ఎప్పటిలాగే తమ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ నే పక్ష నేతగా ప్రకటించింది. కానీ, సభలో మూడో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మాత్రం ఇప్పటివరకు తమ శాసన సభ పక్షా నేత ఎవరో తేల్చలేకపోయింది.

బలం పెరిగినా..

ఇటీవలి ఎన్నికలలో బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలుపొందింది. అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ఊదరగొట్టినా దానికి చాలా దూరంలో నిలిచిపోయింది. అయితే , 19 సీట్లలో రెండోస్థానంలో నిలిచి ఫర్వాలేదనిపించింది. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకుండా, బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చున్నట్లు కనిపించకపోయినా, ఇంకాస్త పటిష్ఠంగా ముందుకెళ్లి ఉంటే బీజేపీకి కచ్చితంగా రెండు అంకెల సంఖ్యలో సీట్లు వచ్చేవి. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక సీటుకే పరిమితం అయిన పరిస్థితి కంటే ఇప్పటిది మెరుగైన పరిస్థితే. 2018లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం గెలిచారు.

రాజాసింగ్ కు కాదా?

బీజేపీ శాసన సభాపక్షం నాయకత్వం గత రెండు పర్యాయాలు గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వర్తించారు. ఆయన ఈసారి కూడా గెలిచినా సభా పక్ష నేత పదవి ఇవ్వాలనే యోచన లేనట్టుంది ఆ పార్టీకి. దీనికితోడు బీజేపీ తరఫున నిర్మల్ ఎమ్మెల్యేగా గతంలో గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఈసారి సభలో అడుగుపెట్టారు. ఆయనకు ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్లుంది అనే కథనాలు వచ్చాయి. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల మీడియా పాయింట్ లో ఆయనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇక బీజేపీ తరఫున కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరినీ ఓడించారు వెంకట రమణారెడ్డి. ఆయన తొలిసారి నెగ్గారు. కాగా, రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి ఇద్దరిలో ఎవరికి పక్షనేత పదవి ఇవ్వాలనేదానిపై రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు వచ్చాయని కూడా తెలుస్తోంది. దీంతోనే ఇప్పటికీ తేల్చలేదని సమాచారం. ప్రస్తుత సమావేశాలను మాత్రం శాసన సభా పక్ష నేత లేకుండానే ముగించేలా ఉన్నారు. అంటే.. ఇక వర్షాకాల సమావేశాల్లోనే తేలుస్తారన్నమాట.