Begin typing your search above and press return to search.

అయిదుగురు వైసీపీ మంత్రులకు టిక్ పెట్టేస్తారా...?

ఇదిలా ఉంటే ఇపుడు పాతిక మంది మంత్రులలో కనీసంగా అయిదుగురు గరిష్టంగా ఎనిమిది మంది మంత్రులకు నో టికెట్ అని జగన్ చెప్పబోతున్నారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:50 AM GMT
అయిదుగురు వైసీపీ మంత్రులకు టిక్ పెట్టేస్తారా...?
X

వైసీపీలో వై నాట్ 175 అన్న నినాదం చాలా మంది కొంపలు ముంచబోతోంది అని అంటున్నారు. ఇప్పటిదాకా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనీసం ఇరవై నుంచి పాతిక మంది దాకా టికెట్లకు ఎసరు రాబోతోంది అని అంచనా ఉంది. దాని మీద జగన్ పేర్లు అయితే చెప్పలేదు కానీ చూచాయగా తన మనసులో మాటను బయట పెట్టేసారు. టికెట్ ఇవ్వకపోయినా అంతా తన వారే అని కూడా చెప్పుకున్నారు. వారికి పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గదని కూడా స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఇపుడు పాతిక మంది మంత్రులలో కనీసంగా అయిదుగురు గరిష్టంగా ఎనిమిది మంది మంత్రులకు నో టికెట్ అని జగన్ చెప్పబోతున్నారు అని ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. ఆ లిస్ట్ చూస్తే ఉత్తరాంధ్రాలో ఇద్దరు సీనియర్ మంత్రులకు ఈసారి టికెట్ లేదు అని అంటున్నారు.

వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు తనకు ఈసారి పోటీకి ఆసక్తి లేదని చెప్పేశారు అని అంటున్నారు. అయితే తన కుమారుడికి టికెట్ ఇచ్చి తనను పెద్దల సభకు పంపాలని జగన్ని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. అలాగే విజయనగరానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనకు టికెట్ ఈసారి ఇవ్వకపోతే తన సతీమణి బొత్స ఝాన్సీరాణికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు. ఒకవేళ అటు నుంచి ఇటు అయితే బొత్స ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేసే చాన్స్ ఉంది అంటున్నారు.

ఇక కోస్తా నుంచి ఇద్దరు మహిళా మంత్రులకు టికెట్ లేదు రాదు అని ప్రచారం సాగుతోంది. ఈ మహిళా మంత్రులు ఇద్దరూ కీలకమైన మంత్రిత్వ శాఖలనే నిర్వహిస్తున్నారు. కానీ వారి పనితీరు అటు మంత్రులుగా ఇటు ఎమ్మెల్యేలుగా కూడా పెద్దగా సంతృప్తిని అధినాయకత్వానికి ఇవ్వడంలేదు అని అంటున్నారు. ఇదే వరసలో రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రి, జగన్ మంత్రివర్గ విస్తరణలో రెండవసారి పదవిని దక్కించుకున్న ఫైర్ బ్రాండ్ కి ఈసారి టికెట్ కష్టమని అంటున్నారు.

ఈ లిస్ట్ లో ఇంకా కోస్తాకే చెందిన ఒక మాటకారి మంత్రి కూడా ఉన్నారని అంటున్నారు. ఆయనకు కూడా టికెట్ ఉండదని అంటున్నారు. ఆయన విపక్షాల మీద ప్రతీ రోజూ మీడియా ముందు కౌంటర్లు సెటైర్లు వేయడంతో ఘనాపాటి కానీ తన సొంత నియోజకవర్గంలో గ్రాఫ్ పడిపోతున్నా పట్టించుకోవడంలేదు అంటున్నారు. ఇక ఆయన మంత్రిగా తన శాఖ పట్ల కూడా సమర్ధంగా చేయడం లేదు అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే గోదావరి జిల్లాలో ఒక సీనియర్ మంత్రికి కూడా టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇలా చూసుకుంటే కనుక మంత్రివర్గంలో మూడొంతుల మందికి ఈసారి నో చాన్స్ అని జగన్ అనేట్లు ఉన్నారని ప్రచారం అయితే ఉంది. దీంతో మంత్రులకే టికెట్ లేకపోతే మన సంగతేంటి అని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో గుండె దడ మొదలైంది అని అంటున్నారు.