Begin typing your search above and press return to search.

10 గ్రాముల బంగారం రూ.65 వేల మార్కుకు వెళ్లనుందా?

చూస్తుండగానే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.59 వేల నుంచి రూ.62వేలకు చేరుకోవటమే కాదు

By:  Tupaki Desk   |   29 Oct 2023 11:30 AM GMT
10 గ్రాముల బంగారం రూ.65 వేల మార్కుకు వెళ్లనుందా?
X

చూస్తుండగానే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.59 వేల నుంచి రూ.62వేలకు చేరుకోవటమే కాదు.. ఇప్పుడు దాని ధర రూ.65వేల వరకు వెళుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాలు బంగారం ధర మీద ప్రభావాన్ని చూపుతాయన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ - రష్యా రచ్చకు ఇప్పటికే కిందా మీదా పడుతున్న ప్రపంచ దేశాలకు.. ఇజ్రాయల్ - హమస్ మధ్య సాగుతున్న పోరు.. పెనం మీద నుంచి పొయ్యి మీద పడేలా మారిందంటున్నారు. తాజాగా బంగారం ధర అంతకంతకూ పెరుడుతోంది.

శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.650 పెరిగి.. రూ.62,620కు చేరుకుంది. వెండి ధర మాత్రం యధాతధంగా (కేజీ రూ.77,500) ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ 2వేల డాలర్ల మార్కును దాటింది. ఔన్స్ అంటే 31.10 గ్రాములు. తాజాగా ఔన్స్ బంగారం 2,016.3 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ నడుస్తున్న వేళ.. బంగారం ధర వచ్చే వారం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.

గడిచిన మూడు వారాలుగా బంగారం ధరల్ని పరిశీలిస్తే అంతకంతకూ ధరలు పెరుగుతున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్ - హమస్ మధ్య మొదలైన యుద్ధంతో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేర్కొనే బంగారం ధరకు రెక్కలు రావటం కనిపిస్తుంటుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం చూస్తే.. ఇప్పటికే ఔన్స్ బంగారం ధర గతంలో ఉన్న 2009 డాలర్లను దాటేసి 2016 డాలర్లకు చేరుకోవటం చూస్తే.. రానున్న రోజుల్లో మరింత పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు.

ఒక అంచనా ప్రకారం చూస్తే.. తాజాగా పెరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆల్ టైం గరిష్ఠ స్థాయిగా పేర్కొనే 2085 - 2090 డాలర్ల వరకు వెళుతుందని చెబుతున్నారు. ఔన్స్ ధరల్ని కాసేపు పక్కన పెట్టి.. మనకు అలవాటైన 10గ్రాముల లెక్కలో చూస్తే.. దేశీయంగా రూ.65 వేల మార్కు దాటే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద ఎత్తున బంగారం కొనాలని భావించే వారికి ఇప్పుడు ఏ మాత్రం సరైన సమయం కాదంటున్నారు. కాస్త ఆగితే ధర తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. అందుకు అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.