Begin typing your search above and press return to search.

నెల్లూరులో వైసీపీకి చెక్...రెడ్డి గారికి అందలం ?

నెల్లూరు అంటేనే మొదటి నుంచి కాంగ్రెస్ కి తరువాత కాలంలో వైసీపీకి అచ్చి వచ్చిన జిల్లాగా పేరుంది.

By:  Satya P   |   15 Jun 2026 10:00 AM IST
నెల్లూరులో వైసీపీకి చెక్...రెడ్డి గారికి అందలం ?
X

నెల్లూరు అంటేనే మొదటి నుంచి కాంగ్రెస్ కి తరువాత కాలంలో వైసీపీకి అచ్చి వచ్చిన జిల్లాగా పేరుంది. రెడ్లు పెద్ద ఎత్తున రాజకీయ ప్రాబల్యం కలిగిన జిల్లాగా నెల్లూరుని చెబుతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే 2019లో పదికి పది స్వీప్ చేసి వైసీపీ శభాష్ అనిపించుకుంది. అయితే గిర్రున అయిదేళ్ల కాలం తిరిగేసరికి టీడీపీ కూటమి అదే ఫీట్ ని రివర్స్ లో చేసి వైసీపీకి భారీ షాక్ ఇచ్చేసింది. ఫలితంగా వైసీపీకి ఒక్కరంటే ఒక్కరు ఎమ్మెల్యే లేకుండా పోయారు. బలమైన నేతలు అంతా ఇపుడు టీడీపీలోనే ఉన్నారు. ఈ పరిణామాలతో వైసీపీ మొదటి నుంచి కూడదీసుకునే పనిలో ఉంది. కూటమి తన జోరుని ఎక్కడా తగ్గించడం లేదు, ప్రత్యేకించి టీడీపీ అయితే 2024లో దక్కిన విజయాన్ని ఆ రాజకీయ పట్టుని శాశ్వతం చేసుకోవాలని చూస్తోంది. దాని కోసం భారీ ఎత్తున వ్యూహ రచన కూడా చేస్తోంది.

వేమిరెడ్డికి కీలక స్థానం :

నెల్లూరు జిల్లాలో అంగ బలం అర్ధ బలం దండీగా ఉన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి టీడీపీ భారీ గిఫ్ట్ ఇవ్వబోతోంది అని ప్రచారం సాగుతోంది. ఆయన 2018 నుంచి 2024 దాకా రాజ్యసభ మెంబర్ గా వైసీపీలో పనిచేశారు. వైసీపీని నెల్లూరు జిల్లాలో అన్ని విధాలుగా నిలబెట్టడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఆయనకు 2024 ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి వైసీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో టీడీపీ వైపు వచ్చారని ప్రచారం సాగింది. టీడీపీ ఆయనను సాదరంగా ఆహ్వానించి అక్కున చేర్చుకుని ఆయనకూ ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డికి కూడా టికెట్లు ఇచ్చింది. దాంతో మొత్తం నెల్లూరు జిల్లా టీడీపీ కూటమికి చిక్కింది.

కేంద్ర మంత్రి పదవి :

ఈ నేపధ్యంలో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కుతుందని ప్రచారం ఊపందుకుంది. ఆయనకు సామాజిక పరంగానే కాదు రాజకీయంగా ప్రాంతీయ సమీకరణల దృష్ట్యా ఈ పదవిని ఇవ్వడం సముచితం అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. గ్రేటర్ రాయలసీమలో భాగంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే కనుక ఆ ప్రభావం కచ్చితంగా రాయలసీమ మీద కూడా పడుతుందని వచ్చే ఎన్నికల్లో వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో సైతం కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు ఇది ఉపకరిస్తుందని కూడా టీడీపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు.

వైసీపీకి దెబ్బేనా :

గత ఎన్నికల్లో పార్టీని వీడిన వారిని వెనక్కి రప్పించే ప్రయత్నంలో వైసీపీ అధినాయకత్వం ఉంది అని ప్రచారం సాగుతోంది. ఇక వేమిరెడ్డి మీద కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది అని కూడా చెప్పుకున్నారు. ఆయన విలువ ఏమిటి అన్నది వైసీపీకి 2024 ఎన్నికల ఫలితాల తరువాత తెలిసింది అని అంటున్నారు. అయితే టీడీపీలో వేమిరెడ్డికి గౌరవం దక్కుతోంది, అంతే కాదు ఆయన అనుకున్నది చేసే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. ఇపుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కితే కనుక వైసీపీకి రాజకీయంగా మరింత దెబ్బ పడే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అంగబలం అర్ధ బలంతో పాటు కేంద్ర మంత్రిగా బలం కూడా తోడు అయితే నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రెక్కలు జోరందుకోకుండా బ్రేకులు పడతాయని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది వేచి చూడాల్సి ఉంది.