Begin typing your search above and press return to search.

కేసీఆర్ జగన్ లది న్యూట్రల్ ఫ్రంట్ నా ?

దేశంలో ఎన్నో ఫ్రంటులు వచ్చాయి. ఫ్రంట్ రాజకీయాలు దేశంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగుతూ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2025 12:49 PM IST
కేసీఆర్ జగన్ లది న్యూట్రల్ ఫ్రంట్ నా ?
X

దేశంలో ఎన్నో ఫ్రంటులు వచ్చాయి. ఫ్రంట్ రాజకీయాలు దేశంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగుతూ వస్తున్నాయి. ఇందులో కొన్ని సక్సెస్ అయ్యాయి. చాలా వరకూ ఫెయిల్ అయ్యాయి. 1977లో జనతా పార్టీ ప్రయోగం తొలిసారిగా కాంగ్రెసేతర రాజకీయ వేదికగా నిలిచి విజయవంతం అయింది. ఆ తరువాత పదేళ్ళకు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు అయింది. అది కూడా సక్సెస్ అయి అధికారం అందుకుంది. ఇక 1996 ప్రాంతంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు అయి ఇద్దరు ప్రధానులను అందించింది. ఆ తరువాత యూపీయే ఎన్డీయే అన్న రెండు ఫ్రంట్లు మాత్రమే మిగిలాయి. ఈ రోజుకీ అవే ఉన్నాయి. యూపీయే కాస్తా ఇండియా కూటమిగా మార్పు చెందింది. 2024 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం లేకపోయింది. ఎన్డీయే మాత్రం వాజ్ పేయి హయాంలో ఏకంగా ఆరున్నరేళ్ల పాటు మోడీ హయాంలో గత పన్నెండేళ్ళ పాటు దేశాన్ని ఏలుతూ వస్తోంది.

న్యూట్రల్ స్టాండ్ తో :

ఇదిలా ఉంటే జాతీయ రాజకీయాల్లో ఇపుడు కీలక విభజన అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో పాటు వామపక్షాల వంటి పార్టీలు అన్నీ కూడా తమ రాజకీయ సిద్ధాంతాలకు తగినట్లుగా ఉన్న రెండు జాతీయ కూటములలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఉంటే బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే నడుస్తోంది. ఇలా ఎంచుకునే పార్టీలకు బీజేపీ కాంగ్రెస్ లతో మంచి రిలేషన్స్ ఉంటేనే అది సాధ్యపడుతోంది. కానీ ఈ రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఏ వైపూ లేకుండా న్యూట్రల్ స్టాండ్ తీసుకుని ఉన్నాయి. అలా చూస్తే తెలుగు నాట రెండు ప్రాంతీయ పార్టీలు కనిపిస్తాయి. తెలంగాణాలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ. ఈ రెండు పార్టీలు కూడా తమ ప్రాంతీయ రాజకీయాలకు సరిపడని కారణంగా బీజేపీ కాంగ్రెస్ తో దూరం పాటిస్తున్నాయి.

ఆప్షన్ల కోసం :

అయితే అటు జగన్ కానీ ఇటు కేసీఆర్ కానీ జాతీయ స్థాయిలో సరైన రాజకీయ వేదిక అండ కోసం చూస్తున్నాయని అంటున్నారు. ఎందుకంటే ప్రాంతీయ స్థాయిలో రాజకీయం చేయాలంటే బలమైన దన్ను వర్తమానంలో అవసరంగా ఉంది. వైసీపీ విషయం చూస్తే బీజేపీ టీడీపీ కూటమితో చేతులు కలిపి ఏపీలో అధికారంలో ఉంది. అలా బీజేపీతో గతంలో ఉన్న కొంత సాఫ్ట్ కార్నర్ ఇపుడు ఏ విధంగానూ అక్కరకు రావడం లేదు, తమకు రాష్ట్రంలో ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీయే లో వైసీపీది కలవడం అన్నది కలలో మాట. మరి ఇండియా కూటమిలో చేరేందుకు అభ్యంతరాలు ఏమిటి అంటే బోలెడు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను జైలు పాలు అయ్యాను తన మీద తప్పుడు కేసులు పెట్టించారు అని జగన్ లో ఈ రోజుకీ ఆగ్రహం ఉందని అంటారు. దాంతో ఈ రెండు జాతీయ శిబిరాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. కేసీఆర్ విషయం కూడా అలాగే ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ తోనే ఆయన రాజకీయ పోరాటం అంతా ఉంది. అలాగే బీజేపీతో చేతులు కలిపితే మైనారిటీల ఓట్ల తో పాటు అనేక ఇతర ఓట్లు కూడా పోతాయన్న బెంగ ఉంది. దాంతో రెండు పార్టీలకు సమ దూరం ఆయన పాటిస్తున్నారు. అయితే జగన్ కానీ కేసీఆర్ కానీ కొత్త ఆప్షన్ల కోసం అన్వేషిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ప్రాంతీయ పెత్తనంతో :

అయితే గతంలో యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి కాంగ్రెస్ వెనక ఉండి సారధ్యాన్ని వాటికే అప్పగించే విధానం కనుక ఇండియా కూటమిలో వస్తే కనుక అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ తమ ఆలోచనలు మార్చుకోవచ్చు అన్న చర్చ అయితే ఉంది. అది జరగాలీ అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకత్వం బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాలి. బీహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నాయకత్వం మీద ఇండియా కూటమిలో ఇతర పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయని అంటున్నారు. అఖిలేష్ యాదవ్ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చినపుడు బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ తో కలసి ఎక్కువ సేపు గడిపారు. దాంతో కొత్త సమీకరణలకు తెర తీస్తున్నారా అన్న చర్చ సాగుతోంది ఏది ఏమైనా 2026 మే నెలలో జరగబోయే తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత ఇండియా కూటమిలో మార్పులు ఉంటాయని అంటున్నారు. స్టాలిన్ రెండోసారి గెలిచినా లేక మమత నాలుగో సారి గెలిచినా ఇండియా కూటమిలో కాంగ్రెస్ సారధ్యానికి ముప్పు తప్పదని అంటున్నారు. అలా మారిన రాజకీయ నేపధ్యం ఉంటే కనుక జగన్ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా వేరే చర్చగా ఉండబోతోంది.