ఏఐ దూకుడు.. సాఫ్ట్‌వేర్ జాబులు ఉండవా?
కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా వేగంగా మార్చేస్తోంది.
By: A.N.Kumar | 10 Jun 2026 1:00 AM ISTకృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీ ప్రపంచాన్ని మునుపెన్నడూ లేని విధంగా వేగంగా మార్చేస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగంలో ఏఐ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆంథ్రోపిక్ రూపొందించిన 'క్లాడ్ కోడ్', ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన 'కోడెక్స్' వంటి ఆధునిక ఏఐ టూల్స్ ఎంట్రీతో కోడింగ్ ప్రక్రియ గతంతో పోలిస్తే మరింత సులభంగా మారింది. ఇక అటానమస్ టెర్మినల్ అసిస్టెంట్స్ వంటి సాంకేతికతలు మానవ జోక్యం లేకుండానే పూర్తి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి పరీక్షించి విజయవంతంగా అమలు చేసే స్థాయికి చేరుకున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో టెక్ ప్రపంచంలో ఒక కీలకమైన చర్చ మొదలైంది. ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. ప్రస్తుత వేగంతో ఏఐ అభివృద్ధి కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి సంప్రదాయ కోడింగ్ ఉద్యోగాలకు భారీ దెబ్బ తగలవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక సాధారణ ప్రోగ్రామింగ్ పనులను ఏఐ వ్యవస్థలే సమర్థవంతంగా నిర్వహించగల స్థాయికి చేరుకుంటున్నాయని.. భవిష్యత్తులో మానవ కోడర్ల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది.
కంపెనీల్లో పెరుగుతున్న ఏఐ వినియోగం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఐటీ కంపెనీలు ఏఐ ఆధారిత కోడింగ్ టూల్స్‌ను తమ రోజువారీ కార్యకలాపాల్లో విరివిగా వినియోగిస్తున్నాయి. గతంలో డెవలపర్లు గంటలు లేదా రోజులు కష్టపడి చేసే పనులను.. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయగలుగుతున్నాయి. దీనివల్ల సాఫ్ట్‌వేర్ సంస్థలకు ప్రాజెక్ట్ ఖర్చులు భారీగా తగ్గడమే కాకుండా ఉత్పాదకత కూడా ఊహించని స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగ భద్రతపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రమాదంలో పడనున్న ఉద్యోగాలు ఇవేనా?
టెక్ నిపుణుల విశ్లేషణల ప్రకారం.. ఏఐ ప్రభావం అందరిపై ఒకేలా ఉండకపోవచ్చు. అయితే కింది విభాగాల వారికి రాబోయే రోజుల్లో సవాలు తప్పేలా లేదు. ప్రాథమిక స్థాయి కోడింగ్ రాసే వారి అవసరం తగ్గొచ్చు. ఆటోమేటెడ్ ఏఐ టూల్స్ కోడ్‌లోని లోపాలను సులభంగా పసిగడుతున్నాయి. ప్రతిరోజూ ఒకే రకమైన మూస పద్ధతిలో పని చేసే వారికి ముప్పు ఎక్కువ. ఒకవేళ ఏఐ ఆధిపత్యం ఇలాగే కొనసాగితే ఐటీ రంగంలో నిలదొక్కుకోవడానికి లక్షలాది మంది ఉద్యోగులు సరికొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన పరిస్థితి కచ్చితంగా ఏర్పడుతుంది.
ఉద్యోగాలు పోవు.. స్వరూపం మారుతుందంతే!
అయితే ఈ పరిణామాలపై టెక్ ప్రపంచంలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొందరు నిపుణులు ఏఐ వల్ల ఉద్యోగాలు పూర్తిగా ఊడిపోవని, కేవలం ఆ ఉద్యోగాల స్వరూపం మాత్రమే మారుతుందని చెప్తున్నారు.
భవిష్యత్తులో ఏఐ టూల్స్‌ను ఎవరు సమర్థంగా, చాకచక్యంగా వినియోగించుకోగలరో అటువంటి నిపుణులకు మార్కెట్‌లో మరింత డిమాండ్ పెరుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఈ ఏఐ విప్లవం సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలికింది. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వడమే ఇప్పుడు టెక్కీల ముందున్న ఏకైక మార్గం.
