Begin typing your search above and press return to search.

భర్తకు గుడి కట్టించిన భార్య

జీవిత భాగస్వామి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.

By:  Tupaki Desk   |   25 April 2024 10:50 AM GMT
భర్తకు గుడి కట్టించిన భార్య
X

కరోనా వైరస్ ఎంత కలకలం కలిగించిందో తెలిసిందే. చాలా మంది ప్రాణాలు బలితీసుకుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించారు. మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రకోపానికి ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురయ్యాయి. ఈనేపథ్యంలో కరోనా వల్ల పలువురి జీవితాలు కకావికలం అయ్యాయి. కాపురాలు కూలిపోయాయి. జీవిత భాగస్వామి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.


కరోనా కాలంలో తన భర్త చనిపోవడంతో ఆమె ఎంతో బాధపడింది. కలకాలం తోడుండే భర్త దూరం కావడాన్ని తట్టుకోలేకపోయింది. భర్త రూపాన్ని తన మనసులోనే నింపుకుంది. తన పతికి ఏదో చేయాలని సంకల్పించింది. తనకున్న భూమిలో భర్తకు ఓ గుడి కట్టాలని భావించింది. దీని కోసం సుమారు రూ. 20 లక్షలు ఖర్చుచేసి అతడి రూపంతో ఓ గుడి నిర్మించి బుధవారం ఆవిష్కరించింది. తన జీవితాశయం నెరవేర్చుకుంది.

ఇక మీదట భర్త ఎక్కడో కాదు తన కళ్ల ముందే ఉంటాడని చెబుతోంది. ఆ దేవుడు దూరం చేసినా భర్త కోసం సర్వం త్యాగం చేసి తనకు గుడి కట్టించి తనలో భర్తపై ఎంత ప్రేమ ఉందో నిరూపించుకుంది. భర్త చనిపోయాక భార్యలు రెండో పెళ్లి చేసుకునే భార్యలున్న సమాజంలో ఆమెకు పిల్లలు లేకపోయినా భర్త స్వరూపంతోనే గుడి కట్టించి తనలో గొప్ప భార్య ఉందనే సందేశం ఇచ్చింది.

భర్తతో సుమారు 27 సంవత్సరాలు సహజీవనం చేసింది. కానీ ఆ దేవుడికి కోపం వచ్చిందో ఏమో కరోనా రూపంలో అతడిని కబళించాడు. తనలో కలిపేసుకున్నాడు. దీంతో ఆమె భర్త కోసం తీవ్రంగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి మండలం సోమ్లా తండాకు చెందిన కల్యాణికి బానోతు హరిబాబుతో 27 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి సంతానం లేదు. ఇద్దరే జీవించేవారు.

కరోనా భర్తను దూరం చేయడంతో ఎంత ఖర్చయినా ఫర్వాలేదు తన భర్తకు గుడి కట్టాలని భావించింది. అనుకున్నదే తడవుగా రాజస్థాన్ నుంచి విగ్రహం తెప్పించింది. తనకున్న భూమిలో అందంగా గుడి కట్టించి అందులో హరిబాబు విగ్రహాన్ని ప్రతిష్టించింది. దీంతో ఆమెకు భర్తపై ఉన్న ప్రేమకు అందరు ఫిదా అయిపోతున్నారు. భార్యంటే ఇలా ఉండాలని పలువురు చెప్పుకోవడం గమనార్హం.