Begin typing your search above and press return to search.

బీమా చేయించి భర్తను ఏసేసింది

ఇరవై ఏళ్ల క్రితం చాగంటి రవి.. ప్రశాంతికి పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రవి ఆటో డ్రైవర్ గా పని చేస్తుంటాడు.

By:  Garuda Media   |   9 March 2026 10:33 AM IST
బీమా చేయించి భర్తను ఏసేసింది
X

బంధాలు.. అనుబంధాలు గతంలో కుటుంబ వ్యవస్థకు బలంగా ఉండేవి. గడిచిన కొంతకాలంగా పాడు కాలం నడుస్తోంది. ఇప్పటివరకు ఏమైతే బలంగా ఉండే బంధాలు.. ఇప్పుడు వివాహేతర సంబంధాల కారణంగా.. కాసుల కక్కుర్తి కారణంగా బలహీనమైనపోతున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. మద్యానికి బానిసైన భర్త అనారోగ్యానికి గురి కావటం.. అతడు చచ్చిపోతాడన్న ఉద్దేశంతో బీమా చేయిస్తే.. ఎంతకూ చావటం లేదని చివరకు తానే చంపేయించిన దుర్మార్గం ఖమ్మం జల్లాలో వెలుగు చూసింది. విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇంతటి కిరాతక ఐడియాలు ఎలా వస్తాయన్న సందేహం కలుగకమానదు. అసలేం జరిగిందంటే..

ఇరవై ఏళ్ల క్రితం చాగంటి రవి.. ప్రశాంతికి పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రవి ఆటో డ్రైవర్ గా పని చేస్తుంటాడు. మద్యానికి బానిసైన అతను తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. దీనికి తోడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో.. అనారోగ్యంతో భర్త చనిపోతాడన్న ఉద్దేశంతో అతడి మీద భారీగా బీమా చేయించింది. ఏడాది అవుతున్నా.. అనారోగ్యంతో ఉన్న భర్త చనిపోకపోవటంతో.. భర్తకు బావమరిది వరుస అయ్యే శ్రినివాస్ తో దుర్మార్గమైన ప్లాన్ చేసింది.

అతడ్ని హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే.. భర్త పీడ విరగడ కావటంతో పాటు.. బీమా డబ్బులు భారీగా వస్తాయని భావించింది. తన దరిద్రగొట్టు ప్లాన్ ను వివరించి.. ఆ పని చేసేందుకు శ్రీనివాస్ ను ఒప్పించింది. తమ ప్లాన్ ను అమలు చేసేందుకు శ్రీనివాస్ మరికొందరి సాయం తీసుకున్నాడు. తమ ప్లాన్ లో భాగంగా.. ఈ నెల 2న తన ఆటోలో రవిని తీసుకెళ్లిన శ్రీనివాస్.. దారి మధ్యలో మద్యం తాగించాడు. అనంతరం ఖమ్మం గ్రామీణ మండలం ఎంవీపాలెం శివారులో వదిలేసి వెళ్లిపోయాడు.

మద్యం మత్తులో తిరుగుతున్న రవిని.. ముందుగా వేసుకున్న ప్లాన్ తో జోగి రాజ్ కుమార్.. వెంకటేశ్ ఇద్దరు తమ కారుతో రవిని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టి చంపేశారు. వీరి ప్లాన్ కు రాంబాబు అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రవి ఉదంతంలో పోలీసులకు కొన్ని సందేహాలు వచ్చాయి. దీంతో.. తమ విచారణను ముమ్మురం చేశారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా.. భార్యను విచారించిన క్రమంలో వారి అనుమానాలు మరింత బలాన్ని చేకూరేలా చేశాయి. మరింత లోతు విచారణ అసలు దుర్మార్గాన్ని వెలికి తీసి.. వారందరిని అదుపులోకి తీసుకొని రిమాండ కు తరలించారు. ఎంత కాసుల కక్కుర్తి అయితే మాత్రం భర్తను ఇలా హత్య చేయటమా? అన్నది ప్రశ్న. తాజా ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ దుర్మార్గాలతో ఏ మాత్రం సంబంధం లేని ఇద్దరి పిల్లల భవిష్యత్తు ఏమిటి? వారి మనసుల్ని ఈ దుర్మార్గం ఎంతటి ప్రభావితం చేస్తాయన్నదే అసలు ప్రశ్న.