Begin typing your search above and press return to search.

అనుమానంతో వేధించే భర్తను లేపేసింది.. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన 40 ఏళ్ల పరమేశ్వర్ కు మాదాపూర్ సాయి నగర్ కు చెందిన 35 ఏళ్ల భారతికి పెళ్లైంది.

By:  Tupaki Desk   |   5 Sept 2024 4:00 PM IST
అనుమానంతో వేధించే భర్తను లేపేసింది.. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన
X

అనుమానం పెనుభూతంగా మారి నిత్యం వేధింపులకు గురి చేస్తున్న భర్త తీరుతో విసిగిపోయిన భార్య.. అతడ్ని అంతమొందించేందుకు భారీ ప్లాన్ వేసింది. కొడుకు సాయంతో చంపేసిన ఆమె చేసిన దారుణాన్ని కూతురు చూసింది. అయితే.. భర్తను హత్య చేసి.. ఆ నేరం తన మీద పడకుండా ఉండేందుకు పెద్దనాటమే ఆడింది. అయితే.. కుమార్తె బంధువులకు ఫోన్ చేసి చెప్పటంతో మొత్తం విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి చెందిన 40 ఏళ్ల పరమేశ్వర్ కు మాదాపూర్ సాయి నగర్ కు చెందిన 35 ఏళ్ల భారతికి పెళ్లైంది. వీరికి 15 ఏళ్ల కుమారుడు.. 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. నగరానికి వలస వచ్చిన వీరి కుటుంబం.. ఈ మధ్యనే పర్వత్ నగర్ లోని అద్దె ఇంటికి మారారు. పరమేశ్వర్ డ్రైవర్ గా పని చేస్తుంటే.. భారతి ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తూ కుటుంబానికి సాయంగా ఉన్నారు. గతంలో బీఎస్ మక్తాలో ఉండేవారు. ఈ మధ్యనే పర్వత్ నగర్ లోకి మారారు.

అయితే.. భార్య మీద అనుమానంతో పరమేశ్వర్ నిత్యం భార్యను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో.. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. భర్త తీరుపై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు చేసింది. ఈ నెల ఒకటో తేదీ రాత్రి మరోసారి భార్యభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో తల్లి.. కొడుకు కలిసి పరమేశ్వర్ ను ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టతో తలపై బలంగా కొట్టారు. కింద పడిన పరమేశ్వర్ ను ఇస్త్రీ పెట్ట వైరుతో మెడకు బిగించారు.

ఇదంతా చూసిన కుమార్తె.. తల్లిని ప్రశ్నించటంతో.. ఆమెకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరమేశ్వర్ చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. అసలేం జరిగిందన్న విషయంపై కుమార్తె బంధువులకు ఫోన్ చేసి చెప్పటంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసుల విచారణలో భారతి తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. ఆమెను పోలీసులు కోర్టుకు హాజరుపర్చగా.. కుమారుడ్ని జువైనల్ హోంకు తరలించారు. స్థానికంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది.