కంటతడి పెట్టిస్తున్న నేవీ ఆఫీసర్ భార్య "జైహింద్" సెల్యూట్ వీడియో!
ఈ సమయంలో ఆయన మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ కనిపించి.. అనంతరం తన భర్త శవపేటికకు సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
By: Tupaki Desk | 23 April 2025 11:30 PM ISTకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి కొత్త జంటల జీవితాలను కాళ్ల పారాణి ఆరకముందే చిదిమేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) రెండేళ్ల క్రితమే నేవీలో చేరారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న వివాహ బందంలోకి అడుగుపెట్టగా.. 19న విందు నిర్వహించారు.
అనంతరం తన భార్యను తీసుకొని కశ్మీర్ కు హనీమూన్ కు వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో నేవీ అధికారి వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో ఆయన మృతదేహం పక్కనే భార్య రోదిస్తూ కనిపించి.. అనంతరం తన భర్త శవపేటికకు సెల్యూట్ చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
అవును... ఇండియన్ నేవీలోని ఓ లెఫ్టినెంట్ ను వివాహం చేసుకుని.. తన హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లింది హిమాన్షి. ఈ క్రమంలో.. వారంలోపే తన భర్త శవపేటికను కౌగిలించుకుని, ఓదార్చలేనంతగా ఏడుస్తూ.. తనను తాను నిలబెట్టుకోవడానికి సహాయం కోరింది.. అనంతరం నిటారుగా నిల్చొని సెల్యూట్ చేసింది.
భర్త శవపేటికపై పడి రోదిస్తూ.. తనను తాను కుదుటపరుచుకున్న హిమాన్షు... అనంతరం నిటారుగా నిలబడింది. "జై హింద్" అని అరుస్తూ తన భర్తకు వీడ్కోలు వందనం చేసింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారిని.. కంటతడి పెట్టిస్తోంది. అందరితోనూ తన భర్త శవపేటికకు అప్రయత్నంగానే సెల్యూట్ చేయిస్తోంది!
కాగా... మంగళవారం పహల్గాం లోని బైసరన్ లోని మైదానంలో భార్యతో కలిసి బేల్పూరి అస్వాదిస్తున్నప్పుడు లెఫ్టినెంట్ నర్వాల్ తలపై ఓ ఉగ్రవాది తుపాకీలోని తూటా దిగిపోయింది. దీంతో.. ఆమె ముఖంపై భర్త రక్తం చిమ్మింది. ఈ క్రమంలో.. బుధవారం నర్వాల్ మృతదేహాన్ని శవపేటికలో ఢిల్లీకి తీసుకొచ్చారు.
ఈ సమయంలో తన భర్త శవపేటిక ముందు నిలబడిన హిమాన్షు.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. మేము అతన్ని అన్ని విధాలుగా గర్వపడేలా చేస్తాము.. ఈ సమయంలో ఆ శవపేటికను కౌగిలించుకొని ఏడ్చింది.. దానిపై ఉన్న అధికార టోపీ ముందు పదే పదే వంగి నమస్కారం చెప్పింది.
