విజయ్ చెక్కు తిప్పిపంపిన సంఘవి.. కారణం ఇదేనా..?
నటుడు, టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్ లో పెట్టిన సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు.
By: Tupaki Desk | 29 Oct 2025 11:21 AM ISTనటుడు, టీవీకే అధినేత విజయ్ సెప్టెంబర్ లో పెట్టిన సభలో తొక్కిసలాట జరిగి చాలా మంది మరణించారు. దీనిపై తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అయితే.. విజయ్ బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారికి చెక్కులను పంపించాడు. తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాల కళ్లలో కన్నీరు ఇంకా ఇంకలేదు. ఆ కన్నీటి వెనుక నిశ్శబ్ద విలువ ఇప్పుడు దేశం మొత్తం ఆలోచింపజేస్తోంది. సినీ హీరోగా ఎదిగిన ఆయన రాజకీయాల్లో అడుగులు వేసేందుకు తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ పెట్టాడు. ఈ పార్టీ తరుఫున బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాడు. అయితే ఆ సాయంను ఒక యువతి సంఘవి తిరస్కరించింది. ఆమె మాటలు మనసును కదిలించేంత నిజాయితీగా ఉన్నాయి ‘మాకు డబ్బు ముఖ్యం కాదు, మేము ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం.’ అన్నారు.
బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిన విజయ్..
విజయ్ పంపిన ఆర్థిక సాయం ఈ నెల 18న బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమైంది. కానీ, రమేశ్ అనే బాధితుని భార్య సంఘవి ఆ డబ్బును తిరిగి పంపించింది. ఎందుకంటే ఆమె ఆశించినది కేవలం నోట్లు కాదు. ఆత్మీయత. విజయ్ వీడియో కాల్‌లో మాట్లాడి పరామర్శిస్తానని చెప్పినా.. సంఘవి ఆ మాటను నమ్మింది. ఆ తర్వాత ఆయన స్వయంగా వచ్చి ఓదారుస్తారని ఎదురు చూసింది. కానీ అది జరగలేదు. ఆ నిరీక్షణ తీరకపోవడంతో, ఆమె తీసుకున్న నిర్ణయం మానవ విలువల దృష్టిలో ప్రతీకగా నిలిచింది.
ప్రజా క్షేత్రంలో ఉన్న వారు డబ్బు సాయం చేయడం సాధారణం విషయం. ప్రమాదం, మరణం ఎక్కడైనా సాయం అనే పదం వస్తుంది. కానీ, దాని వెనుక ఉన్న ఉద్దేశం, హృదయపూర్వకత, మానవ సంబంధం అనే అంశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సంఘవి చేసిన ఈ పని ఆ దృష్టిలో ఒక ప్రశ్నను కలిగిస్తోంది. ‘మనసుకు తాకని సహాయం విలువ ఎంత?’
విజయ్ వచ్చి ఓదార్చి ఉంటే..
విజయ్ వంటి ప్రముఖుల నుంచి వచ్చిన సాయం సహజంగానే పబ్లిసిటీని తెచ్చిపెడుతుంది. కానీ సంఘవి తిరస్కరణలో పబ్లిసిటీ లేదు.. విజయ్ తమ వద్దకు వచ్చి ఉంటే తమకు కొంతలో కొంత ఓదార్పుగా ఉండేదని, ప్రతి సారి డబ్బే గెలుస్తుందనుకోవడం సరికాదన్నారు. మరణించిన తన భర్త రమేశ్ జ్ఞాపకంలో ఆమెకు కావలసింది సంతాపం, ఒక ఆత్మీయ మాట, ఒక ఆదరణ చూపు. కానీ, సాయంగా వచ్చిన డబ్బు ఆ లోటును భర్తీ చేయలేకపోయింది.
సంఘవి చేసిన పనిపై దేశ వ్యాప్తంగా చర్చ..
ఈ సంఘటన తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా మానవ సంబంధాల అర్థాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది డబ్బు ఇచ్చిన తర్వాత తమ బాధ్యత ముగిసిందనుకుంటారు. కానీ, బాధితులు కోరేది ‘ఎవరో వచ్చి నా బాధను వినాలి’ అనే సాధారణమైన కోరిక. అది డబ్బుతో పోల్చలేని విలువ. విజయ్ రాజకీయం వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనకు కూడా ఒక మౌన పాఠంలా ఉంటుంది. రాజకీయాల్లో నోట్లు కాదు, నమ్మకం గెలవాలి. సాయం కాదు, సానుభూతి గెలవాలి.
సంఘవి తిరిగి పంపిన ఆ 20 లక్షలు ఇప్పుడు కేవలం ఒక మొత్తం కాదు. అది మనసు విలువకు ప్రతీక. సమాజం, నాయకులు, ప్రజా ప్రతినిధులు దీనినుంచి తెలుసుకోవాల్సింది స్పష్టమే: సహాయం చేయడం కంటే హృదయంతో తాకడం గొప్పది. ఎందుకంటే, డబ్బు ఒక్కసారే ఖర్చవుతుంది కానీ, సానుభూతి పంచితే శాశ్వతంగా నిలుస్తుంది.
