Begin typing your search above and press return to search.

“ఫిబ్రవరి 14” చీకటి రోజుగా పిలవబడుతుంది ఎందుకు?

టీనేజర్స్ కి ఇది ఎంతో ముఖ్యమైన రోజుగా ఉంటే... వారు కాస్తా తల్లితండ్రులు అయిన తర్వాత కాస్త టెన్షన్ డే గానే ఉంటుందని అంటుంటారు.

By:  Tupaki Desk   |   9 Feb 2024 2:30 PM GMT
“ఫిబ్రవరి 14” చీకటి రోజుగా  పిలవబడుతుంది ఎందుకు?
X

సాధారణంగా ఫిబ్రవరి 14 అంటే గుర్తొచ్చేది.. "ప్రేమికుల దినోత్సవం" అని! ఆ రోజున ప్రధానంగా యువతీ యువకులు తాము ప్రేమించిన వారికి, ప్రేమించామనుకునే వారికీ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.. అది ఆయా ప్రేమికుల జీవితంలో ప్రేమ ఉన్నంతకాలం ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది! దీనిపై భిన్నాభిప్రాయాలు ఉంటూనే ఉన్నాయి. టీనేజర్స్ కి ఇది ఎంతో ముఖ్యమైన రోజుగా ఉంటే... వారు కాస్తా తల్లితండ్రులు అయిన తర్వాత కాస్త టెన్షన్ డే గానే ఉంటుందని అంటుంటారు.

ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో చాలా మందికి ఫిబ్రవరి - 14 అనేది బ్లాక్ డే! అలా అని వీరేమీ ప్రేమకు శత్రువులూ కాదు.. ప్రేమికులకు వ్యతిరేకులూ కాదు! ఆ రోజు జరిగిన దారుణానికి మానసికంగా దెబ్బతిన్నవారు.. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోలేనివారు.. ఆరోజుని తలచుకుని మనవారు చేసిన త్యాగాలను స్మరించుకునేవారు మాత్రమే! కారణం... 2019 ఫిబ్రవరి 14... భారతదేశ చరిత్రపై ముష్కరులు నెత్తుటి మరక వేసిన రోజు!!

అవును... భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు. సరిగ్గా ఐదేళ్ల క్రితం అదే రోజున భారత భద్రతా బలగాలపై ముష్కరులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సరిగ్గా ఫిబ్రవరి 14న మధ్యాహ్నం సమయంలో జేషే మహమ్మద్‌ కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. నలభై మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న రెండు బస్సులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

దక్షిణ కాశ్మీర్‌ లోని పుల్వామా జిల్లాలో హైవే వెంట ప్రయాణిస్తున్న ఇండియన్ పారామిలటరీ వాహనాల్లో సీఆర్పీఎఫ్ బలగాలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కాసేపటికే ఉగ్రవాద సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ దాడులకు తామే బాధ్యులమని ఆ వీడియోలో ప్రకటించుకుంది. అనంతరం... పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.

దీంతో భారత్ ప్రతీకార కాంక్షతో రగిలిపోయింది. ఇందులో భాగంగా... 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత.. ఫస్ట్ టైం మన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటాలని ఫిక్సయ్యాయి. ఈ నేపథ్యంలో... 2019, ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత వైమానిక దళం జెట్‌ లు బాలాకోట్, పాకిస్తాన్‌ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉగ్ర శిబిరంపై బాంబు దాడులు చేశాయి. సుమారు పన్నెండు మిరాజ్ - 2000 విమానాలు ఈ ఆపరేషన్‌ లో పాల్గొన్నాయి. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైనికుల దెబ్బకి మట్టిలో కలిసిపోయారు!

ఈ నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో భారత సైన్యంపై పాక్ దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27, 2019న పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సమయంలో ఒక ఎఫ్-16 విమానం, రెండు భారతీయ మిగ్-21 బైసన్స్ ధ్వంసమయ్యాయని నివేధికలు పేర్కొన్నాయి. ఈ సమయంలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌.. పొరపాటున పాక్ కి చిక్కారు. అనంతరం అతడిని విడుదల చేయనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు.

ఈ క్రమంలో సుమారు 60 గంటల నిర్భందం తర్వాత 2019 మార్చి 1న పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ ను భారత అధికారులకు అప్పగించారు. ఆ విధంగా పాక్ చెర నుంచి మీసం తిప్పుతూ.. భారతదేశ ముద్దు బిడ్డ రొమ్ము విరుచుకుంటూ.. వాఘా వద్ద సరిహద్దును దాటి మాతృభూమిలోకి ప్రవేశించారు.

ఇలా ఇన్ని విషయాలకు, ఎన్నో దారుణాలకు, మరెన్నో కన్నీటి ఏరులకు కారణమైన ఫిబ్రవరి 14రోజుని చాలా మంది బ్లాక్ డేగా భావిస్తారు.. ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన 40 మంది సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను తలచుకుంటారు.. పాక్ ముష్కరుల చేష్టలను తలచుకుని మండిపడుతుంటారు! బాలాకోట్ లోను ఉగ్ర శిభిరాలపై ఐఏఎఫ్ చేసిన దాడులను, అభినందన్ ధైర్య సాహసాలను తలచుకుని మీసం తిప్పుతూ... భారత్ మాతా కీ జై అని నినదిస్తుంటారు.