Begin typing your search above and press return to search.

అనిల్ అంబానీ దీన స్థితి!

రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన ధీరూభాయ్ అంబానీ చిన్న కొడుకుగా సుపరిచితమైన అనిల్ అంబానీ జీవితం భలేసిత్రంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:30 AM GMT
అనిల్ అంబానీ దీన స్థితి!
X

ఒకప్పుడు ఆసియాలోనే టాప్ 10 ధనవంతుల్లో ఒకరిగా పేరున్న వ్యక్తి అనిల్ అంబానీ. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన పారిశ్రామికవేత్తల్లో ఒకరైనా ముకేశ్ అంబానీ సోదరుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన ధీరూభాయ్ అంబానీ చిన్న కొడుకుగా సుపరిచితమైన అనిల్ అంబానీ జీవితం భలేసిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు వేల కోట్ల ఆస్తిపరుడు.. తర్వాతి రోజుల్లో అప్పుల చిక్కుల్లో చిక్కుకొని.. ఇప్పుడు సాదాసీదా జీవితాన్ని అనుభవిస్తున్న ఆయన తీరు చూసినప్పుడు చేసుకున్నోడికి చేసుకున్నంత అన్న భావన కలుగక మానదు.


ధీరూబాయ్ అంబానీ గురించి తెలిసిందే. రూ.300 జీతానికి పెట్రోల్ బంక్ లో పని చేసిన ఆయన తర్వాతి కాలంలో వేలాది కోట్ల సంపదకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పేరుతో పెట్టిన ఆయన కంపెనీ.. ఈ రోజున దేశంలోఏ మూల చూసినా ఆ సంస్థే అన్ని వ్యాపారాల్ని సొంతం చేసుకుంటూ వెళుతున్న వైనం కనిపిస్తుంది.

ధీరూభాయ్ పెద్ద కుమారుడు ముకేశ్ అంబానీ గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మరణం తర్వాత అన్న ముకేశ్ తో విభేదించి.. రిలయన్స్ ను రెండు ముక్కలు చేసి.. ఒక ముక్కకు తాను రాజు అయ్యారు అనిల్ అంబానీ. అయితే.. ముకేశ్ అంబానీకి ఉన్న వ్యాపార చతురత అనిల్ అంబానీకి లేదన్న విషయం చాలా త్వరగానే అర్థం కావటం.. ఆయన వ్యాపార సంస్థలన్ని కోర్టు కేసుల్లోనూ.. అప్పుల్లోనూ చిక్కుకుపోవటంతో ఆయన తన ఆస్తుల్ని అమ్ముకుంటున్న పరిస్థితి.

తాజాగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖుల్లో అనిల్ అంబానీ ఒకరు. ముంబయి ఎయిర్ పోర్టులో ఆయన హ్యుందయ్ ఎలక్ట్రికల్ కారులో ప్రయాణించటం హాట్ టాపిక్ గా మారింది. అయోధ్య నుంచి ముంబయిలోని తన ఇంటికి వెళ్లే క్రమంలో ఆయన ఒక ఎలక్ట్రికల్ కారులో జర్నీ చేయటం అందరిని ఆకర్షించింది. అనిల్ అంబానీ గతం.. వర్తమానాన్ని గుర్తు తెచ్చుకున్న పలువురు.. జర్నీ మెర్సిడెజ్ టు హ్యుందయ్య’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు అంబానీల స్టేటస్ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్ రోవర్.. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్.. రోల్స్ రాయిస్.. లంబోర్ఘిని గల్లార్డోలో తిరిగే అనిల్ అంబానీ.. ఇప్పుడు బ్లాక్ కలర్ హ్యుందయ్ ఐయోనిక్ 5లో ప్రయాణించటం చూస్తే కాలమహిమ అనే కన్నా.. చేసుకున్నోడికి చేసుకున్నంత అని మాత్రం చెప్పక తప్పదు.

అనిల్ అంబానీ పుణ్యమా అని ఇప్పుడీ హ్యుందయ్ ఐయోనిక్ 5 మీద అందరి చూపు పడింది. దీని ధర ఎంత ఉందన్నది చూస్తే కనిష్ఠంగా రూ.44.95 లక్షలు మొదలు రూ.46.05 లక్షలు. అది కూడా ఎక్స్ షోరూం ధర. ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అదనంగా ఐదు నిమిషాలు ఛార్జ్ పెడితే మరో 100కి.మీ. ప్రయాణించే వీలుందని చెబుతున్నారు. 215 బీపీహెచ్ పవర్ ఈ కారు సొంతం.