Begin typing your search above and press return to search.

తెలుగు సినీ పద్మాలు ఎందుకు వికసించవు...!?

ఎవరు అయినా తమ జీవితానికి సాఫల్యం కలిగింది అని భావించాలంటే పద్మ అవార్డుని అందుకుంటేనే చాలు అని అనుకుంటారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 5:22 AM GMT
తెలుగు సినీ పద్మాలు ఎందుకు వికసించవు...!?
X

పద్మ పురస్కారాలు ఒక ఉన్నతమైన గౌరవం. పౌర పురస్కారాలకు ఇవి అసలైన కొలమానాలు. ఎవరు అయినా తమ జీవితానికి సాఫల్యం కలిగింది అని భావించాలంటే పద్మ అవార్డుని అందుకుంటేనే చాలు అని అనుకుంటారు. అంతటి గౌరవప్రదమైన పద్మ అవార్డుల విషయంలో ప్రతీ సారీ తెలుగు వారికి తీరని అన్యాయమే జరుగుతోంది.

ఏటా వందకు పైగా పద్మ అవార్డుల ఎంపిక జరుగుతుంది. అందులో పద్మశ్రీలు పద్మ భూషణ్ లు, పద్మ విభూషణ్ లు ఇలా మూడు కేటగిరీలు ఉంటాయి. పద్మశ్రీల విషయం తీసుకుంటే తెలుగు చిత్ర సీమలో ఈ అవార్డు దక్కింది బహు కొద్ది మందికే యాభై దశకంలో పద్మ అవార్డుల ప్రదానం మొదలైంది. ఆనాటి నుంచి చూసుకుంటే వాటిని అందుకున్న వారు చాలా తక్కువ మందే అని చెప్పాలి.

ఒక నాగయ్య, ఒక భానుమతి, ఒక ఘంటసాల రేలంగి వంటి వారు గత తరంలో పద్మశ్రీలు అందుకున్నారు. 1968లో ఒకేసారి అక్కినేని, ఎన్టీయార్ లకు పద్మశ్రీలను కేంద్రం ప్రకటించడం ఆనాటి సంచలనం. ఆ తరువాత మళ్ళీ చాలా కాలం తరువాత వరకూ పద్మ అవార్డులు తెలుగు సినీ వాకిట విరబూయలేదు.

ఈ మధ్యలో ఎందరో ప్రముఖులకు పద్మ అవార్డులు అందకుండానే పోయాయి. మహానటి సావిత్రికి ఆలస్యంగా పద్మశ్రీ ఇస్తే ఆమె వద్దు అని సున్నితంగా తిరస్కరించారని చెబుతారు. ఇక విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావుకు పద్మ పురస్కారమే దక్కలేదు. అలాగే ప్రఖ్యాత హాస్య నటుడు రాజబాబుకు ఈ అవార్డు అందని పండు అయింది.

ఇదే వరసలో చూసుకుంటే టాలీవుడ్ ఖ్యాతిని ఏనాడో ఖండాంతరాలకు తీసుకెళ్ళిన ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాధ్ కి కేవలం పద్మశ్రీతో సరిపెట్టారు. అది కూడా ఆయన జీవిత చరమాంకంలో. అలాగే బాపుకు పద్మశ్రీతోనే చాలు అనిపించారు. ఆయనకు కూడా మరణం తలుపులు తడుతూండగా అవార్డు ఇచ్చారు.

ఘంటసాల తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన బాలుకు పద్మశ్రీ పురస్కారం దక్కాలంటే ఆయన సినీ ప్రస్తానంలో మూడు దశాబ్దాలు వేచి చూడాల్సి వచ్చింది. బాలుకు నాడు జరిగిన సన్మాన సభకు హాజరైన అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలుకు పద్మశ్రీ కాదు పద్మ భూషణ్ ఇవ్వాలని అనడం విశేషం.

ఇక అక్కినేనికి పద్మశ్రీ అవార్డు తర్వాత రెండు దశాబ్దాలకు కానీ పద్మ భూషణ్ అవార్డు దక్కలేదు. ఇక ఆయన జీవిత చివరి దశలో పద్మ విభూషణ్ ఇచ్చారు. మహానటి బహు ముఖ ప్రజ్ణాశాలి భానుమతికి పద్మశ్రీతోనే సరిపెట్టారు. ఆమె సైతం పద్మ విభూషణ్ కి అర్హురాలే అన్నది జనం మాట.

ఇక జగ్గయ్యకు పద్మభూషణ్ ఇచ్చినా అది కూడా చాలా ఆలస్యంగానే అన్నది ఒక విమర్శ. దక్షిణాది లతా మంగేష్కర్ గా పేరు గడించిన పి సుశీలకు ఎన్నో దశాబ్దాల ఎదురు చూపుల తరువాత పద్మ భూషణ్ ఇచ్చారు అదే అవార్డు ఎస్ జానకికి ఇంకా ఆలస్యంగా ఇస్తే ఆమె కూడా వద్దు అని సున్నితంగా తిరస్కరించారు. సూపర్ స్టార్ క్రిష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీని తన భుజాల మీద దశాబ్దాల పాటు మోస్తే ఆయన సినీ ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు దశాబ్దాల తరువాత కానీ పద్మభూషణ్ అవార్డు దక్కలేదు.

ఇక పద్మ అవార్డులు దక్కని ప్రతిభావంతుల లిస్ట్ చూస్తే కనుక చాలా పెద్దదే అని చెప్పాలి. నటభూషణ శోభన్ బాబుకు అలాగే రెబెల్ స్టార్ క్రిష్ణంరాజుకు పద్మశ్రీ అయినా దక్కలేదు. అలాగే నటీమణులలో వాణిశ్రీ, శారద, జమున వంటి విదుషీమణులకు పద్మ పురస్కారాలు అంటే ఆమడ దూరం అనే చెప్పాలి. ఇక బాల నటుడి నుంచి విలక్షణ నటుడిగా ఎదిగిన అలీకి కానీ నటకిరీటిగా పేరు గడించి అవలీలగా పాత్రధారణ చేసే రాజేంద్రప్రసాద్ కి కానీ పద్మ పురస్కారాలు దక్కలేదు.

దర్శకులలో దాసరి నారాయణరావుని సైతం పద్మ అవార్డు వరించకపోవడం ఒక విడ్డూరం. అలాగే కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్, గుమ్మడి వంటి ప్రతిభావంతులకు కూడా పద్మ అవార్డు ఎందుకు రాలేదు అంటే జవాబు మాత్రం లేదు. ఇప్పటిదాకా ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డులలో సినీ రంగానికి కేవలం రెండంటే రెండు దక్కాయి. అందులో ఒకటి అక్కినేనికి అయితే మరొకటి చిరంజీవికి దక్కింది. ఇక ఈ ఏడాది ప్రకటించిన పద్మ భూషణ్ లలో ఒక్కటి కూడా తెలుగు వారికి రాలేదు. పద్మశ్రీ మాత్రం ఒక్కటి వచ్చింది.

దేశం మొత్తం మీద చూసినా లేక సౌతిండియాలో చూసినా పద్మ అవార్డులు అతి తక్కువ మందికి దక్కడం ఒక్క తెలుగు నాటే కనిపిస్తుంది. దానికి కారణాలు ఎవరికి వారుగా చెప్పుకోవడమే తప్ప సరైన న్యాయం మాత్రం జరగడంలేదు అన్న ఆవేదన అయితే ఉంది. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ దక్కడం హర్షణీయం. అయితే పద్మ అవార్డులు మళ్లీ తెలుసు సినీ సీమను ఎప్పటికి తాకుతాయి అంటే సమాధానం మాత్రం చెప్పడం బహు కష్టమే.