పవన్ పై ఉండవల్లి షాకింగ్ కామెంట్స్
పవన్ కళ్యాణ్ అంటే ఉండవల్లి ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఏపీ రాజకీయాల్లో ఆయన మీదనే ఆశలు ఉన్నాయని కూడా పలు సందర్భాలలో కూడా ఆయన చెప్పారు.
By: Satya P | 6 Dec 2025 6:13 PM ISTజనసేన అధినేత ఏపీ కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన స్థాయి హోదాకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది అని సూచించారు. పవన్ ని సీఎం అవుతారని తాను అనుకుంటూ వచ్చానని కానీ ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సరికాదని అన్నారు. పవన్ వ్యాఖ్యలు చేసేటపుడు ఆలోచన చేయాలని కూడా ఉండవల్లి సూచించారు
పవన్ పై ఎందుకిలా :
పవన్ కళ్యాణ్ అంటే ఉండవల్లి ప్రత్యేక అభిమానం చూపిస్తారు. ఏపీ రాజకీయాల్లో ఆయన మీదనే ఆశలు ఉన్నాయని కూడా పలు సందర్భాలలో కూడా ఆయన చెప్పారు. ఇక ఉండవల్లిని సైతం పవన్ అలాగే చూస్తారు, అభిమానిస్తారు. అంతలా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపధ్యంలో ఉండవల్లి వాయిస్ పెంచి ఒక్కసారిగా పవన్ మీద విమర్శలు చేశారు. పైగా ఆయనకు ఇది తగదని హితవు చెబుతున్నారు. ఇంతకీ పవన్ చేసినది ఏమిటి ఉండవల్లి సరిచేసుకోమన్నది ఏమిటి అన్నది చూస్తే కనుక ఆసక్తి కలిగిన విషయాలే ఉన్నాయి. ఈ మధ్యనే పవన్ గోదావరి జిల్లాలకు వెళ్ళినపుడు శంకరగుప్తంలో కొబ్బరి రైతులతో మాట్లాడుతూ కొబ్బతి తోటలకు తెలంగాణా దిష్టి తగిలింది అని అన్నారు. దాని మీదనే ఉండవల్లి ఫైర్ అవుతున్నారు. ఆ దిష్టి మాటలు మంచివి కావని ఉండవలి అంటున్నారు. ఈ విషయంలో పవన్ మీద ఆయన ఒకింత అసంతృప్తితో చేసిన వ్యాఖ్యలుగానే వీటిని అంతా చూస్తున్నారు.
అమరావతిలో బాబు జగన్ :
ఇదిలా ఉంటే అమరావతి రాజధాని పట్ల తనకు వ్యతిరేకత ఏదీ లేదని ఉండవల్లి చెప్పారు. అయితే అమరావతి కోసం ప్రపంచంలోని ఎక్కడ నుంచో పెట్టుబడులను తీసుకున్న బాబు తెలంగాణా నుంచి తన సొంత వ్యాపారాలను ఎందుకు తీసుకుని రావడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. అలాగే జగన్ తన భారతి సిమెంట్స్ ని కూడా అమరావతి రాజధానిలో పెట్టాలని ఆయన కోరారు. ఈ విషయం ప్రస్తుత సీఎం బాబు మాజీ సీఎం జగన్ ఇద్దరూ కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ మీద కూడా :
పనిలో పనిగా బీజేపీ మీద కూడా ఆయన విమర్శలు చేశారు. ఆర్ ఎస్ ఎస్ పాంచజన్యం పుస్తకం చదివిన తరువాతనే తాను ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాను అని కొత్త విషయం ఉండవల్లి చెప్పారు. మరి ఆయన అంతకు ముందు ఆర్ఎస్ఎస్ లో ఏమైనా ఉన్నారా అన్న కొత్త చర్చకు ఆస్కారం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. ఇక హిందూ మతం అన్నది ఒక సనాతన ధర్మం అని కోర్టు 1964 లోనే తీర్పు ఇచ్చిందని ఉండవల్లి గుర్తు చేశారు. అయితే దానిని రాజకీయం కోసం బీజేపీ వాడుకుంటోందని ఉండవల్లి విమర్శించారు.
బాబు మోడీ స్నేహం :
అదే విధంగా మోడీ చంద్రబాబుల మధ్య ఉన్నది రాజకీయ స్నేహం మాత్రమే అని ఉండవల్లి తేల్చేశారు ఈ ఇద్దరి మనసులు అయితే ఎపుడూ కలవలేదని ఆయన అనడం విశేషం. అయితే ఏపీలో చూస్తే రాజకీయం చిత్రంగా ఉందని ఉండవల్లి అన్నారు. అధికార ప్రతిపక్షాలు అన్నీ కూడా మోడీ కోసమే పనిచేస్తున్నాయని ఆయన చురకలు అంటించారు. ఉత్తరాది రాష్ట్రాలలో మాదిరిగా ఏపీలో బీజేపీ ఎపుడూ బలపడేది ఉండదని కూడా ఉండవల్లి తనదైన జోస్యం వినిపించారు. మొత్తం మీద చాలా కాలానికి మీడియాతో మాట్లాడిన ఉండవల్లి బాబుని జగన్ ని పవన్ ని ఎవరినీ వదలకుండా తనదైన సెటైర్లు పేల్చారు అని అంటున్నారు.
