Begin typing your search above and press return to search.

తిరుమలలో వీఐపీ సిఫార్సు లేఖలు రిజెక్టు అవుతాయెందుకు?

కలియుగ వైకుంఠంగా పేర్కొనే తిరుమల తిరుపతికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపుతుంటారు.

By:  Tupaki Desk   |   20 April 2025 4:28 AM
Why TTD Rejects VIP Recommendation Letters for Tirumala
X

కలియుగ వైకుంఠంగా పేర్కొనే తిరుమల తిరుపతికి వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపుతుంటారు. వేసవి సెలవుల్లో అయితే రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అయితే.. తిరుమలకు వెళ్లే ప్రతి పది మందిలో ఐదుగురు ఏదో ఒక సిఫార్సు లేఖతో కొండ మీదకు చేరుకుంటారు. కానీ.. కొంతమంది మినహా మిగిలిన చాలామంది తాము తెచ్చే సిఫార్సు లేఖల్ని టీటీడీ అధికారులు తిరస్కరిస్తున్నట్లుగా ఆరోపిస్తుంటారు. టీటీడీ తీరును విమర్శిస్తూ ఉంటారు.

ఎందుకిలా జరుగుతుంది? తిరుమలలో వీఐపీలు జారీ చేసే సిఫార్సు లేఖల్ని ఎందుకు తిరస్కరిస్తూ ఉంటారు? దానికి కారణం ఏమిటి? తిరస్కరణకు గురైన లేఖల్లో చాలావరకు సరైన ఫార్మాట్ లో లేకపోవటం.. ప్రొసీజర్ కు అనుగుణంగా జారీ కాకపోవటం కూడా దీనికి కారణంగా చెప్పాలి. కేంద్రమంత్రులు.. ఎంపీలు.. రాష్ట్ర మంత్రులు.. ఎమ్మెల్యేలు.. టీటీడీ బోర్డు మెంబర్లు పోలీసు ఉన్నతాధికారులు.. ఐఏఎస్ లు .. మీడియా సంస్థలు ఇలా ఒకటి కాదు రెండు కాదు.. చాలా మంది ఈ సిఫార్సు లేఖల్ని జారీ చేస్తుంటారు.

అయితే.. మర్చిపోకూడని అంశం ఏమంటే.. సిఫార్సు లేఖల్ని టీటీడీ జారీ చేసిన ఫార్మాట్ లో జారీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సిఫార్సు లేఖల్ని జారీ చేసే విషయాన్నే తీసుకుంటే.. సదరు మంత్రి.. ఎమ్మెల్యేకు రోజువారీగా ఒక కోటాను టీటీడీ జారీ చేసి ఉంటుంది.ఆ కోటాను మాత్రమే వాడుకోవాలే తప్పించి.. అంతకు మించి సిఫార్సు లేఖల్ని జారీ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.

ఒక మంత్రి ఎవరికైనా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిపార్సు లేఖ ఇవ్వటానికి ముందు.. దానిని తనవైపు నుంచి టీటీడీ కార్యాలయానికి సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అది కూడా వారు పేర్కొన్న విధానంలో మాత్రమే. ఇలా జారీ చేసిన లేఖలకు అరుదైన సందర్భాల్లో తప్పించి.. మామూలుగా ఆ లేఖలకు తగ్గట్లుగా సేవల్ని కేటాయిస్తారు. అయితే.. ఎక్కడ తప్పు జరుగుతుందంటే.. తిరుమలకు సిఫార్సు లేఖల కోసం డిమాండ్ భారీగా ఉంటుంది.

దీంతో.. తమకు అత్యంత సన్నిహితులు.. బాగా కావాల్సిన వారి విషయంలో ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యే నేతలు.. మిగిలిన వారికి తమ పేరుతో ఉన్న లెటర్ హెడ్ మీద తమ విన్నపాన్ని మన్నించాలన్నట్లుగా లెటర్ ఇస్తారు. మరి.. ఈ లేఖలు పని చేయవా? అంటే.. కొండ మీద రద్దీ ఎక్కువగా ఉంటే ఇలాంటి వాటిని అస్సలు పరిగణలోకి తీసుకోరు. రద్దీ లేని వేళలో మాత్రమే.. ఈ లేఖలకు అంతో ఇంతో స్పందించే పరిస్థితి.

మొత్తంగా చూస్తే.. తిరుమలకు వీఐపీ సిఫార్సు లేఖ చేతిలో ఉండగానే సరిపోదు.. అది ప్రొసీజర్ కు అనుగుణంగా ఉందా? లేదా? అన్నది చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే.. చేదు అనుభవాల బారిన పడకుండా ఉంటారు. కోరుకున్నట్లుగా శ్రీవారి దర్శనం ఇబ్బందులు ఎదురు కాకుండా పూర్తవుతుంది. వేసవి వేళలో రద్దీ ఎక్కువగా ఉండే ఏప్రిల్ 15 నుంచి మూడు నెలల పాటు సిఫార్సు లేఖల్ని స్వీకరించరు. స్వయంగా వచ్చే వీఐపీ ప్రొటోకాల్ పరిధిలోని భక్తులకు.. ప్రొసీజర్ ప్రకారం అప్లికేషన్లు చేసుకునే వారికి మాత్రమే బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు. మిగిలిన లేఖల్ని రిజెక్టు చేస్తారు. సో.. వీఐపీ లెటర్ చేతిలో ఉంటే దర్శనం అయిపోతుందన్నది ఉత్త భ్రమేనని మర్చిపోకూడదు.