బీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీ.. మున్సిపోల్స్ లో మారిన సీఎం ఫోకస్
తెలంగాణలో తాజాగా జరుగుతున్న మున్సిపోల్స్ రణరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ మారటాన్ని గమనించారా?
By: Tupaki Desk | 10 Feb 2026 10:26 AM ISTతెలంగాణలో తాజాగా జరుగుతున్న మున్సిపోల్స్ రణరంగంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ మారటాన్ని గమనించారా? పంచాయితీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలను సంధించిన ఆయన.. తాజా ఎన్నికల వేళ మాత్రం బీజేపీ.. కేంద్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూస్తే.. పంచాయితీల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉంటుందని.. అదే పట్టణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా బీజేపీ పట్టును సీఎం రేవంత్ గుర్తించినట్లుగా చెబుతున్నారు.
ఈ కారణంతోనే.. ఆయన తన ప్రసంగాల్లోనూ.. మీడియా సమావేశాల్లోనూ కేంద్రంలోని మోడీ సర్కారు మీదా.. బీజేపీ మీదా.. తెలంగాణ బీజేపీ నేతల్ని ప్రధాన టార్గెట్ గా మార్చుకోవటం కనిపిస్తుంది. పన్నెండేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి తెలంగాణకు చేసిందేమీ లేదన్న సీఎం రేవంత్.. మోడీని చూసి ఓటు వేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని.. ఈ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య సమస్య వస్తే తీర్చాల్సింది రాష్ట్రప్రభుత్వమే తప్పించి కేంద్రం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదన్నది ఆయన వాదన.
ఎన్నికల్లో ఓటు వేయించుకొని సీట్లు తెచ్చుకోవటం తప్పించి తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయాల్ని ఏకరువు పెట్టటం కనిపిస్తుంది. 2014 ఎన్నికల వేళ పాలమూరు సభలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ తెలంగాణకు వచ్చినప్పుడు ఆ హామీని ప్రస్తావించి.. జాతీయ హోదా ప్రస్తావన చేస్తారని భావించినా.. అదేమీ జరగలేదని చెప్పటం గమనార్హం.
హైదరాబాద్ వరద సాయంలో ముంపునకు గురైన సందర్భంలో కారుకు కారు.. బైకుకు బైకు ఇస్తామని గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ ప్రచారం చేశారని.. కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని.. కానీ మూడోవంతు డివిజన్లలో పార్టీ గెలిచిన తర్వాత ఆ ఊసే లేకుండాపోయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో దేన్ని వదలకుండా అవినీతికి పాల్పడ్డారని.. చివరకు ఫోన్ లో మాట్లాడుకునే ప్రతిపక్షాల వారిని.. జడ్జిలను.. జర్నలిస్టులను.. సినీ తారలను కూడా వదల్లేదన్నారు. అలాంటి తప్పుడుపనులు చేసినా.. విచారణకు సీబీఐ ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని.. వేలాది కోట్ల అవినీతి జరిగిందని మోడీ.. అమిత్ షా అన్నారని.. ఆ కేసును సీబీఐకి ఇస్తే.. 48 గంటల్లో కేసీఆర్ ను అరెస్టుచేస్తామని.. మీకు చేతకావటం లేదని తనను కిషన్ రెడ్డి అంటే.. తాను ఆ ఫైల్ ను సీబీఐకు ఇచ్చానని ఆర్నెల్లు అయినా సీబీఐ కేసీఆర్, హరీశ్ లను కనీసం విచారణకు కూడా పిలవలేదంటూ ఎద్దేవా చేశారు. ఇలా తాను ప్రస్తావించిన ప్రతి అంశంలో బీజేపీ వైఫల్యాలు.. కేంద్రంలోని మోడీ సర్కారు తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వని తీరునే ప్రధానంగా ప్రస్తావించటం చూస్తే..మున్సిపోల్స్ వేళ మారిన సీఎం రేవంత్ ఫోకస్ ఇట్టే అర్థమవుతుంది.
