పక్షులు ఎప్పుడూ 'వీ' ఆకారంలో ఎందుకు ఎగురుతాయి?
అవును... ఆకాశంలో పక్షులు, ప్రధానంగా కాస్త లాంగ్ జర్నీ చేసే పక్షులు వీ అకారంలో కలిసి ప్రయాణిస్తాయనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 July 2025 3:00 PM ISTరోడ్డుపై వెళ్లే మనిషి కంటే అడవిలోని జంతువులు, ఆకాశంలోని పక్షలు అత్యంత క్రమశిక్షణతో, ఐక్యంగా ప్రయాణిస్తుంటాయని చెబుతారు. ఈ క్రమంలో ఆకాశంలోని పక్షులను పరిశీలిస్తే.. అవి గుంపులు గుంపులుగా ప్రయాణిస్తున్నప్పుడు ఎప్పుడూ ఇంగ్లిష్ అక్షరం "వీ" ఆకారంలోనే ఎగురుతూ కనిపిస్తాయి. ఆ దృశ్యం అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. అయితే పక్షులు ఇలా వీ ఆకారంలోనే ఎందుకు ప్రయాణిస్తాయి.
అవును... ఆకాశంలో పక్షులు, ప్రధానంగా కాస్త లాంగ్ జర్నీ చేసే పక్షులు వీ అకారంలో కలిసి ప్రయాణిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే.. అవి అలానే ఎందుకు ప్రయాణిస్తాయి.. ఒకదాని పక్కన ఒకటో, చీమల్లా ఒకదాని వెనుక ఒకటో కలిసి ఎందుకు వెళ్లవు అనేది ఆసక్తికర విషయం. దీనిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, నాసా సంస్థల శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
ఇందులో భాగంగా... వీ ఆకారంలో ఎగరడం అనేది పక్షుల శక్తిని ఆదా చేయడంలో సహాయపడుతుందని.. ఇందులో ముందున్న పక్షి గాలి భారాన్ని ఎక్కువగా తీసుకుంటుండగా.. దాని వెనుక ఉన్న పక్షులు తమ నాయకుడి రెక్కల ద్వారా సృష్టించబడిన గాలి ప్రవాహాల పైకి ఎగురుతాయని.. ఈ పైకి కదిలే గాలి వెనకనున్న పక్షులకు అదనపు లిఫ్ట్ ను అందిస్తుందని.. దీంతో అవి తక్కువ శక్తితోనే ఎగరడాన్ని సులభతరం చేస్తుందని తెలిపారు!
వాస్తవానికి వీ ఆకారంలో ముందు భాగంలో ఉండటం కష్టమైన పనే. అందువల్ల ఇక్కడే పక్షుల్లోని టీంవర్క్, కోఆర్డినేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగా... ముందు భాగంలో ఉన్న పక్షి అలసిపోయినప్పుడు, అది వెనక్కి రాగా.. మరొక పక్షి ఆ వీ ఆకారానికి నాయకత్వం వహిస్తుంది. ఈ వ్యూహం మొత్తం సమూహంలో ఒక్క పక్షి ఒంటరిగా ఎగరగలిగే దానికంటే ఎక్కువ దూరం ఎగరడానికి సహకరిస్తుంది.
యుఎస్ నేషనల్ ఆడుబన్ సొసైటీ ప్రకారం.. ఈ ఉమ్మడి పనితనం అనేది వెనుకంజలో ఉన్న పక్షుల ప్రయాణించే సామర్థ్యాన్ని 70% వరకు మెరుగుపరుస్తుంది. అయితే ఈ ప్రయాణం కేవలం శక్తిని ఆదా చేయడమే కాకుండా, పక్షులు ఒకదానితో ఒకటి దృశ్య సంబంధాన్ని కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది. ప్రధానంగా... గుంపులు గుంపులుగా వేల కిలోమీటర్లు ప్రయాణించే వలస సమయంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఇలా వీ ఆకారంలో ఎగరడం వల్ల ప్రతి పక్షి, తన పక్కనున్న తోటి పక్షిని చూడటంతో పాటు సమూహ మార్గాన్ని అనుసరించడం, ఒకరినొకరు ఢీకొనకుండా చూసుకోవడాన్ని సులభతరం చేస్తుందని అంటున్నారు. అంటే... ఈ పక్షుల వీ ఆకార ప్రయాణం కేవలం తెలివిగా ఎగరడం మాత్రమే కాదు, సురక్షితంగా కూడా ఎగరడాన్ని సూచిస్తుందన్నమాట.
