Begin typing your search above and press return to search.

అమెరికాలో భారతీయులపై ఒక్కసారిగా జాతివివక్ష ఎందుకు పెరిగింది?

విదేశాల్లో ఉన్న స్థానికులందరూ రేసిస్టులు కాదు. నేటికీ కోట్లాది మంది భారతీయులు విదేశాల్లో అత్యంత గౌరవంగా, స్థానికులతో సామరస్యంగా జీవిస్తున్నారు.

By:  A.N.Kumar   |   29 May 2026 1:47 AM IST
అమెరికాలో భారతీయులపై ఒక్కసారిగా జాతివివక్ష ఎందుకు పెరిగింది?
X

సోషల్ మీడియా యుగంలో సరిహద్దులు చెరిగిపోతున్నాయని ఒకవైపు మురిసిపోతుంటే… మరోవైపు అదే సోషల్ మీడియా వేదికగా విదేశాల్లో భారతీయులపై విద్వేషం అనే కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిన్నటి వరకు ఐటీ ఉద్యోగాల కోసం భారతీయుల వైపు చూసిన దేశాలు… నేడు "గో బ్యాక్" అంటూ నినాదాలు చేయడం వెనుక అసలు కథ ఏంటి? గ్లోబల్ మార్కెట్‌లో ఇండియన్స్‌పై ఒక్కసారిగా ఈ నెగెటివిటీ పెరగడానికి కారణాలేంటి?

నిన్న 'టాలెంటెడ్'.. నేడు 'టార్గెట్'!

ఒకప్పుడు విదేశాల్లో "ఇండియన్" అంటే హార్డ్‌వర్కింగ్, టాలెంటెడ్, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న వ్యక్తిగా గౌరవించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కొందరు స్థానికులు కెమెరాలు పట్టుకుని మరీ ఇండియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వ్యూస్ కోసం కొందరు క్రియేట్ చేస్తున్న థంబ్‌నెయిల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రపంచ ఆర్థిక మాంద్యానికి, స్థానిక నిరుద్యోగానికి, చివరికి ట్రాఫిక్ జామ్‌లకు కూడా భారతీయులనే బాధ్యులను చేస్తూ వింత పోకడలు మొదలయ్యాయి.

“ఇండియా అంత గొప్పదైతే.. ఇక్కడికి ఎందుకు వచ్చారు?”

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అయింది. ఒక అమెరికన్ రోడ్డుపై వెళ్తున్న భారతీయ జంటను ఆపి, “ఇండియా బెటరా? అమెరికా బెటరా?” అని ప్రశ్నించాడు. వారు ఎంతో హుందాగా “రెండు దేశాలకూ ప్రత్యేకతలు ఉన్నాయి” అని సమాధానమిచ్చారు. కానీ ఆ స్థానికుడు అంతటితో ఆగక “ఇండియా అంత గొప్పదైతే మరి అమెరికాకు ఎందుకు వచ్చారు? మీ దేశానికే వెళ్ళిపోవచ్చుగా!” అంటూ అరిచాడు.

విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ సొంత దేశాన్ని ద్వేషించాలనే వింత లాజిక్‌ను కొందరు తెరపైకి తెస్తున్నారు. మరి ఇదే లాజిక్ ప్రకారం ప్రతి ఏటా లక్షల మంది అమెరికన్లు యూరప్, ఆసియా దేశాలకు ఎందుకు వలస వెళ్తున్నారో వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

రేసిజం.. ఇప్పుడు ఒక 'కంటెంట్ క్రియేషన్'!

అసలు భారతీయులపై ఇంతలా ద్వేషం పెరగడానికి ప్రధాన కారణం "సోషల్ మీడియా మోనిటైజేషన్". గతంలో సమాజంలో మూలన కూర్చుని మాట్లాడే కొద్దిమంది జాత్యహంకారులకు ఇప్పుడు రీల్ కెమెరా, మైక్, యూట్యూబ్ అకౌంట్లు దొరికాయి. భారతీయులను టార్గెట్ చేస్తూ వీడియోలు పెడితే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుండటంతో దీనిని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చేసుకున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగా ఉద్యోగాల కొరత, ఇమ్మిగ్రేషన్ నిబంధనల కఠినతరం, ఆర్థిక మందగమనం వంటి సమస్యలు తోడయ్యాయి. స్థానిక రాజకీయ నాయకులు కూడా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి “బయటివాళ్లు వచ్చి మన అవకాశాలను దోచుకుంటున్నారు” అనే న్యారేటివ్‌ను ప్రజల్లోకి బలంగా నెడుతున్నారు. అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నది భారతీయులే కావడంతో సహజంగానే టార్గెట్ మనపై పడుతోంది.

పనికొస్తే ‘వెల్‌కమ్’.. పక్కన ఉంటే ‘గో బ్యాక్’?

ఇండియన్లపై విమర్శలు చేసే దేశాల అసలు రంగును గమనిస్తే ఒక విచిత్రమైన నిజం బయటపడుతుంది.గూగుల్ (సుందర్ పిచాయ్), మైక్రోసాఫ్ట్ (సత్య నాదెళ్ల), అడోబ్, ఐబీఎం వంటి టాప్ కంపెనీల సీఈఓలు ఇండియన్సే. విదేశీ ఆసుపత్రులలో ప్రాణాలు కాపాడే అత్యుత్తమ వైద్యులలో భారతీయులదే అగ్రస్థానం. గ్లోబల్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా, రీసెర్చర్లుగా ఇండియన్స్ సేవలు అందిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ల నుండి ఐటీ మేనేజర్ల వరకు వ్యవస్థను నడిపిస్తోంది భారతీయులే. అంటే... కంపెనీని లాభాల్లోకి నడపడానికి ఇండియన్ సీఈఓ కావాలి, ప్రాణాలు కాపాడటానికి ఇండియన్ డాక్టర్ కావాలి. కానీ అదే ఇండియన్ పక్కింట్లో ఇల్లు కొంటే మాత్రం "గో బ్యాక్" అంటారు.. దీనినే ‘సెలెక్టివ్ గ్లోబలైజేషన్’ అంటారు.

విదేశాల్లో ఉన్న స్థానికులందరూ రేసిస్టులు కాదు. నేటికీ కోట్లాది మంది భారతీయులు విదేశాల్లో అత్యంత గౌరవంగా, స్థానికులతో సామరస్యంగా జీవిస్తున్నారు. కేవలం కొద్దిమంది సోషల్ మీడియా వీరులు, ఫ్రస్ట్రేషన్ బ్యాచ్ మాత్రమే ఈ "యాంటీ-ఇండియన్" ట్రెండ్‌ను వైరల్ చేస్తున్నారు.

ఇందులో ఉన్న అసలైన కామెడీ ఏంటంటే... పగలల్లా భారతీయులపై సోషల్ మీడియాలో విషం కక్కే కొందరు విదేశీయులు.. రాత్రి అవ్వగానే ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లి ‘బటర్ చికెన్’, ‘బిర్యానీ’ ఆర్డర్ చేసుకుని లొట్టలేసుకుంటూ తింటుంటారు! అంటే అవసరార్థం వ్యూస్ పాపులారిటీ కోసం రాజేసే రేసిజం ఇది అని అర్థమవుతోంది. ఒకప్పుడు నిజమైన అమెరికన్లను తొక్కేసి యూరప్ వాళ్లు అమెరికాను ఆక్రమించి ఏలుతున్నది వాళ్లే. నిజమైన అమెరికన్లు కూడా ఇలా నిరసిస్తే అమెరికా నుంచి యూరప్ సహా ఇప్పుడు తిట్టేవారంతా బయటకు వెళ్లాల్సిందే..