Begin typing your search above and press return to search.

భారత్‌ – కెనడా క్లాష్‌.. ఎవరీ గురుపత్వంత్‌ సింగ్‌!

కాగా ఇండియా – కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో ఉన్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఖలిస్తాన్‌ అనుకూల గ్రూప్‌.. సిక్‌ ఫర్‌ జస్టిస్‌ నేత గురు పత్వంత్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 3:15 AM GMT
భారత్‌ – కెనడా క్లాష్‌.. ఎవరీ గురుపత్వంత్‌ సింగ్‌!
X

తమ దేశ పౌరుడు, ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత్‌ ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అభియోగాలు మోపుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ హత్య కేసు దర్యాప్తులో భారత్‌ తమతో కలిసి రావాలని.. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అంతటితో ఆగని ట్రూడో తమ దేశంలోని భారత్‌ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. మరోవైపు తన మిత్ర దేశాలు.. అమెరికా, బ్రిటన్‌ దేశాల నేతలకు కూడా భారత్‌ పై ఫిర్యాదులు చేశారు.

ఇంకోవైపు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని భారత్‌ తీవ్రంగా ఖండించింది. కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా పేర్కొంది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా ఇండియా – కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో ఉన్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఖలిస్తాన్‌ అనుకూల గ్రూప్‌.. సిక్‌ ఫర్‌ జస్టిస్‌ నేత గురు పత్వంత్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడాలో ఉన్న భారత పౌరులకు మన దేశ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని.. భారతీయులపై దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. జాగ్రత్తగా మసలుకోవాలని సూచించింది.

కాగా కెనడాలో హిందువులకు హెచ్చరికలు జారీ చేసిన గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. అతడు పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ జిల్లా ఖాన్‌కోట్‌ గ్రామంలో జన్మించాడు. తండ్రి పంజాబ్‌ స్టేట్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ బోర్డులో ఉద్యోగి. గురు పత్వంత్‌ సింగ్‌.. చంఢీగడ్‌ లోని పంజాబ్‌ యూనివర్శిటీలో న్యాయ పట్టా పొందాడు.

లా చదివాక విదేశాలకు వెళ్లిపోయిన గురు పత్వంత్‌ సింగ్‌ మొదట్లో డ్రైవర్‌ గా పనిచేశాడు. ఈ క్రమంలో అమెరికా పౌరసత్వాన్ని పొందాడు. ఆ తర్వాత కెనడాకు మకాం మార్చిన అతడు సిక్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థకు న్యాయ ప్రతినిధిగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కెనడా పౌరసత్వం కూడా పొందాడు. ప్రత్యేక ఖలిస్తాన్‌కు మద్దతుగా అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు.

ప్రత్యేక ఖలిస్తాన్‌ ఏర్పాటు కోసం పనిచేస్తున్న గురు పత్వంత్‌ సింగ్‌ ఈ ఏడాది జూలైలో ఒక వీడియోను విడుదల చేశాడు. ఉత్తర అమెరికా, యూరప్‌ల్లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్‌లను ముద్రించాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో భారత ప్రభుత్వం 2020లోనే అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై భారత్‌ లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

ఇండియా సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని.. కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని పత్వంత్‌ సింగ్‌ హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను చంపుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో పత్వంత్‌ సింగ్‌ పై అంతర్జాతీయ స్థాయిలో రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేయాలని భారత్‌ కోరినప్పటికీ ఇంటర్‌పోల్‌ ఇంకా జారీ చేయలేదు.