రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం
ఐఐటీ కాన్పూర్‌లో చదివి యాక్సెంచర్‌లో ఉద్యోగం ప్రారంభించిన త్రపిత్ బన్సల్, పరిశోధనపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి ఏఐ రంగంలోకి వెళ్లారు. ఐఐఎస్సీ, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో పరిశోధన అనంతరం ఓపెన్ఏఐలో ఓ1 రీజనింగ్ మోడల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మెటా నుంచి సుమారు రూ.800 కోట్ల విలువైన భారీ ఆఫర్ అందుకున్నారు.
By: A.N.Kumar | 22 Nov 2026 10:04 AM ISTకలలు కనడం అందరికీ సాధ్యమే.. కానీ ఆ కలల కోసం చేతిలో ఉన్న సురక్షితమైన ఉద్యోగాన్ని వదులుకుని.. అంతులేని పరిశోధనల బాట పట్టడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన త్రపిత్ బన్సల్ జీవితం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిపాఠం. సాధారణ గణిత విద్యార్థిగా మొదలైన అతడి ప్రయాణం.. నేడు ప్రపంచ టెక్ దిగ్గజం 'మెటా' లో ఏకంగా రూ.800 కోట్ల భారీ ప్యాకేజీతో కీలక బాధ్యతలు చేపట్టే స్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు.. భారతీయ మేధస్సుకు ప్రపంచం వేసిన పట్టం..
2012లో ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్ నుంచి పట్టా అందుకున్నప్పుడు తోటి విద్యార్థులంతా లక్షల రూపాయల ప్యాకేజీల వెంట పరుగులు తీశారు. త్రపిత్ కూడా యాక్సెంచర్‌లో మంచి ఉద్యోగంలో చేరాడు. కానీ అతడి మనసు మాత్రం ఏదో తెలియని వెలితితో కొట్టుమిట్టాడేది. కార్పొరేట్ జీవితపు సౌకర్యాల కంటే గణితం, ఏఐ లోతులను అన్వేషించడమే తన అసలైన గమ్యమని అతడు గుర్తించాడు. ఆ క్షణం తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయం అతడి జీవితాన్నే మార్చేసింది. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి బెంగళూరులోని ఐఐఎస్సీ లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేరాడు. అక్కడి నుంచి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి తన మేధస్సుకు మరింత పదును పెట్టాడు.
నిరంతర శ్రమ, పరిశోధనల పట్ల ఉన్న అంకితభావం త్రపిత్ను ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ సంస్థల దృష్టిలో పడేలా చేశాయి. ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేస్తూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా 2022లో ఓపెన్ఏఐలో పూర్తిస్థాయి పరిశోధకుడిగా చేరిన తర్వాత అతడి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. మనిషిలా ఆలోచించి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించే 'ఓ1 రీజనింగ్ మోడల్' అభివృద్ధిలో త్రపిత్ కీలక పాత్ర పోషించాడు.
నేడు ఏఐ రంగంలో తదుపరి విప్లవమైన సూపర్ ఇంటెలిజెన్స్ ను నిర్మించేందుకు మెటా సంస్థ త్రపిత్ బన్సల్‌కు సుమారు రూ.800 కోట్ల స్టాక్ అవార్డులు, ప్రోత్సాహకాలతో కలిపి భారీ ఆఫర్ ఇవ్వడం వెనుక దశాబ్దానికి పైగా సాగిన అతడి తపస్సు ఉంది.
మనకు నచ్చిన దారిలో నిజాయితీగా శ్రమిస్తే విజయం ఏదో ఒకరోజు మన ఇంటి తలుపు తడుతుంది అనడానికి త్రపిత్ బన్సల్ జీవితమే నిలువెత్తు నిదర్శనం. ఐఐటీ క్లాస్‌రూమ్‌లో మొదలైన ఆ చిన్న గణిత ఆసక్తి నేడు ప్రపంచ భవిష్యత్తును శాసించే ఏఐ సాంకేతికతను నిర్మించే స్థాయికి ఎదగడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయం...
