Begin typing your search above and press return to search.

భారతీయ విద్యార్థులపై దాడులపై స్పందించిన వైట్ హౌస్

ఇటీవల కాలంలో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Feb 2024 2:45 AM GMT
భారతీయ విద్యార్థులపై దాడులపై స్పందించిన వైట్ హౌస్
X

ఇటీవల కాలంలో అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై దాడులు జరగటం.. పది రోజుల పవ్యవధిలో పలువురు విద్యార్థులు మరణించటం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. మౌనంగా ఉన్న వైట్ హౌస్ తాజాగా స్పందించింది. భారతీయ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. దాడుల్ని అడ్డుకునేందుకు బైడెన్ సర్కారు ప్రయత్నిస్తున్నట్లుగా వెల్లడించింది.

ఇటీవల కాలంలో అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు భారతీయ అమెరికన్ విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటివి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్న వైట్ హౌస్.. ‘‘జాతి.. లింగం.. మతం.. లేదంటే ఇతర అంశాల ఆధారంగా హింసను ఒప్పుకునేది లేదు. అమెరికాలో ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. అలాంటి దాడుల్ని అడ్డుకోవటానికి రాష్ట్ర స్థానిక అధికారులతో కలిసి మేం చేయాల్సిదంతా చేస్తాం. అధ్యక్షుడితో పాటు ఆయన యంత్రాంగం దీనిపై చాలా కష్టపడి పని చేస్తోంది’’ అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. అమెరికాలో ఉండి ఉన్నతచదువులు చదువుతున్న విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏదైనా దాడులు జరిగినంతనే విద్యాసంస్థల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులు.. వేగంగా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న సూచనలు వస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న దాడులపై భారత్ లోని విద్యార్థుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంటాయని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ వ్యాఖ్యానించారు. వరుసగా జరుగుతున్న దాడులపై వైట్ హౌస్ ఇంతకు ముందే స్పందించి ఉంటే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది.