Begin typing your search above and press return to search.

తెలంగాణ కోసం డీఎస్పీ జాబ్ వదులుకున్న నళిని ఇప్పుడెక్కడ?

ఉద్యోగాన్ని ఉద్యోగంగా కాకుండా.. ఉద్యమంతో ముడి పెడతారేంటి? అన్నోళ్లు ఉన్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:18 AM GMT
తెలంగాణ కోసం డీఎస్పీ జాబ్ వదులుకున్న నళిని ఇప్పుడెక్కడ?
X

తెలంగాణ వచ్చిందంటే అది తమ క్రెడిట్ అంటూ గొప్పలు చెప్పుకోవటం చూస్తుంటాం. అయితే.. తెలంగాణ సాధించిన తర్వాత.. అలాంటి వారెందరికో తాము చేసిన దానికి లక్ష రెట్లు ఎక్కువగా లబ్థి పొందటం జరిగింది. అదే సమయంలో ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా.. గుండెల్లో తెలంగాణ మీద ఉన్న ప్రేమతో తమకున్న బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకొని.. వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించిన త్యాగధనులు ఎందరో. ఆ కోవలోకే వస్తారు మాజీ డీఎస్పీ నళిని అలియాస్ దోమకొండ నళిని. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళ.. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారి మీద లాఠీలు విదల్చలేనని చెబుతూ.. తన డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలేశారు నళిని. ఈ సందర్భంగా ఆమె బోలెడన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఉద్యోగాన్ని ఉద్యోగంగా కాకుండా.. ఉద్యమంతో ముడి పెడతారేంటి? అన్నోళ్లు ఉన్నారు.

అయినా.. ఆమె అవేమీ లెక్క చేయకుండా ఉద్యోగాన్ని వదిలేశారు. రోశయ్య ప్రభుత్వంలో ఆమె మళ్లీ జాబ్ లో చేరినా.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో.. మరోసారి జాబ్ వదిలేశారు. కట్ చేస్తే.. గడిచిన దశాబ్దానికి పైగా ఆమె గురించి మాట్లాడిన వారు లేరు. పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు రాజకీయ పార్టీగా చెబుతూ.. తెలంగాణ వచ్చిందంటే తామే కారణమని చెప్పే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా నళిని తలుచుకున్నది.. ఆమెను సత్కరించింది.. ఆమె త్యాగాల్ని గుర్తించింది లేదు. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. మాజీ డీఎస్పీ నళిని ప్రస్తావన తేవటంతో ఆమె ఎక్కడ? ఇప్పుడేం చేస్తున్నారు? లాంటి ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.

ముందుగా.. నళిని గురించి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ఏం మాట్లాడారు? అన్నది చూసిన తర్వాత.. నళిని ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారో చూద్దాం. తాజాగా పోలీసు శాఖ సమీక్ష సందర్భంగా మాజీ డీఎస్పీ నళిని ప్రస్తావన తెచ్చిన సీఎం రేవంత్.. ఆమెకు ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని.. డీజీపీని ఆదేశించారు. ‘‘ఆమెకు జాబ్ చేయాలన్న ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఒకవేళ ఆమెకు అదే ఉద్యోగాన్ని ఇవ్వటానికి పోలీసు శాఖ నిబంధనలు అడ్డు వస్తే.. ఇతర జాబ్ ఇవ్వాలి. నళినికి అదే హోదాలో ఇతర శాఖలో జాబ్ ఇవ్వాలి’’ అంటూ ఆదేశించారు.

ఈ నేపథ్యంలో నళిని ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న ఆసక్తి వ్యక్తమైంది. దీంతో.. ఆమెను పలువురు సంప్రదించారు. ఈ క్రమంలో ఆమె ఫేస్ బుక్ లో ఒక పోస్టు పెట్టారు. అందులో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఆమె చెప్పిన విషయాల్ని చూసిన తర్వాత.. సీఎం రేవంత్ చెప్పినట్లుగా ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని తీసుకుంటారా? లేదా? అన్నది సంశయంగా మారిందని చెప్పాలి. ఎందుకుంటే.. ఆమె తనకున్న పరిమితుల్ని తెలియజేశారు. ఇంతకూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులోని కీలక అంశాల్ని చూస్తే..

- నేను డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత కూడా, నన్ను ఇంకా జనం గుర్తుంచుకున్నారన్న విషయం ఈ రోజు వస్తున్న మెసేజ్‌ల ద్వారా అర్థం అవుతుంది. చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.

- ప్రస్తుతం నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నాను. పూర్తి సాత్వికంగా మారాను. ఉద్యమ సమయంలో నన్ను 4.12.2011న సస్పెండ్ చేశారు. అన్ని పేపర్లలో ఫోటో వేసి మరీ ఆ వార్తను హైలేట్ చేసి రాశారు. నాది దేశద్రోహం అన్నారు. చాలా బాధేసింది. సుష్మా స్వరాజ్ గారు ఒక్కరే దాన్ని ఖండించారు. ఢిల్లీలో దీక్ష, తెలంగాణ యాత్ర, పరకాల ఉప ఎన్నికలో పోటీ, బీజేపీ సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ ఉద్యమంలో భాగంగానే చేశాను.

- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నేను ఎవరినీ కలవలేదు. ఎప్పుడూ నా కోసం నేను ఏమీ అడగలేదు. నా రాజీనామాను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వినతి పత్రం ఎన్నడూ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇలా నేను సడెన్‌గా వార్తల్లోకి ఎలా వచ్చాను? ఇంతమందికి నా కాంటాక్ట్ నంబర్ ఎలా తెలిసింది? ఆశ్చర్యంగా ఉంది.

- ఏమైనా ఇప్పుడు కూడా నాకు యాచించడం ఇష్టం లేదు. ఆ అవసరం నాకు లేదు కూడా. ఒకవేళ ప్రజల ఒత్తిడి మేరకు, ప్రస్తుత ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ జాబ్ ఇచ్చినా, ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నేను దానికి పూర్తి న్యాయం చేయలేను. రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల నా ఫిజికల్ ఫిట్నెస్ పోయింది. చాలా కాలం గడిచింది కాబట్టి పోలీస్ ఆప్టిట్యూడ్‌ను కూడా నేను కోల్పోయాను. సాంకేతికంగా కూడా పోలీస్ సర్వీస్ నిబందనలు నా నియామకాన్ని ఒప్పుకోవు. ఎవరైనా హైకోర్టులో పిల్ వేస్తే.. నా నియామకం రద్దు కావొచ్చు.

- గతంలో ముఖ్యమంత్రి రోశయ్య గారు ఇచ్చారు కదా అని వెళితే ఏం జరిగిందో, 18 నెలలు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇంకా గురుతే. అందుకే నేను ఉద్యోగం అడగను. కానీ బతికి ఉన్నంత వరకు ఏదో రకంగా ప్రజా సేవా చేస్తూనే ఉంటాను.

- త్యాగి నుండి యోగినీ అయ్యి పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేదము, యోగాలను ప్రచారం చేశాను. రోగిని కూడా అయ్యి కోలుకున్న. ఇప్పుడు తపస్వినై, నిత్యాగ్నిహోత్రిని అయ్యి సనాతన ధర్మ మూలాధారమైన వేదం, యజ్ఞమును ప్రచారం చేస్తున్నా. ఇదే మార్గంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్న. ఆనాడు నాలో పొంగింది దేశ భక్తి అయితే, ఇప్పుడు నాలో దైవ భక్తి నిండి ఉంది.