Begin typing your search above and press return to search.

రాజ్యసభ రేసులో టీడీపీ...వైసీపీ స్ట్రాటజీ ఏంటి...!?

వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ నుంచి సీఎం రమేష్ పదవీ విరమణ చేయనున్నారు.

By:  Tupaki Desk   |   25 Jan 2024 1:30 AM GMT
రాజ్యసభ రేసులో టీడీపీ...వైసీపీ స్ట్రాటజీ ఏంటి...!?
X

ఏపీలో వచ్చే మార్చి నెలలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో వైసీపీది ఒకటి, టీడీపీ బీజేపీలకు చెరొకటి ఉన్నాయి. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ నుంచి సీఎం రమేష్ పదవీ విరమణ చేయనున్నారు.

ఏపీ అసెంబ్లీలో బలం చూసుకుంటే వైసీపీకే ఈ మూడు సీట్లు సునాయాసంగా దక్కనున్నాయి. కానీ వైసీపీ అధినాయకత్వం ఇంచార్జిలను ఎడా పెడా మార్చేయడంతో పాటు చాలా మంది సిట్టింగులకు సీటు లేకుండా చేస్తోంది. దాంతో వారిలో చాలా మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి వెల్లువగా ఉందని టీడీపీ భావిస్తోంది. దాంతో టీడీపీ నుంచి అభ్యర్ధిని రాజ్యసభ రేసులో నిలబెట్టాలని డిమాండ్ వచ్చి పడుతోంది.

తాజాగా మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజ్యసభ రేసులో టీడీపీ నిలబడాలని తప్పనిసరిగా గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పడం విశేషం. టీడీపీ మీద భయంతోనే జగన్ తన ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు.

ఏది ఏమైనా టీడీపీలో అయితే ఒక ధీమా కనిపిస్తోంది. ఈసారి రాజ్యసభకు ఒక అభ్యర్ధిని పెడితే గెలిపించుకోగలం అన్నదే ఆ ధీమా. దానికి కారణాలు కూడా ఉన్నాయి. గత ఏడాది ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఇలాగే చివరి నిముషంలో అనూహ్యంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిచింది. అలా టీడీపీకి షాక్ తినిపించింది.

ఇపుడు అలాగే వ్యూహ రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీకి నలుగురు వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యే మద్దతు ఉంది. గంటా ఎమంల్యే ఓటు పోయింది అంటే ఆ నంబర్ 22కి వస్తుంది. ఇక పార్ధసారధి, రక్షణ నిధి, కాపు రామచంద్రారెడ్డి ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీకి యాంటీగా ఓటు వేస్తారు అని భావిస్తున్నారు. దాంతో ఆ ఓట్లు అన్నీ తమకే దక్కుతాయని టీడీపీ లెక్క వేసుకుంటోంది.

అయితే దానికి విరుగుడు వ్యూహాన్ని కూడా అధికార వైసీపీ రచిసోంది. అందులో భాగంగా ముందుగా గంటా రాజీనామా ఆమోదించారు. ఆయన కాకుండా టీడీపీకి మద్దతుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు, వైసీపీ వైపు వచ్చిన మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే ఒక జనసేన ఎమ్మెల్యేల మీద కూడా వేటు వేయబోతోంది అని అంటున్నారు. అంటే ఈ లెక్క అంతా చూస్తే 10 మంది ఎమ్మెల్యేలకు ఈసారి ఓటు హక్కు లేకుండా పోతుంది.

అంటే మొత్తం 175 మంది ఉన్న ఏపీ అసెంబ్లీలో అసలు నంబర్ 165కి పడిపోతుంది. దీన్ని మూడుగా విభజిస్తే ఒక్కో రాజ్యసభ ఎంపీ గెలవడానికి 55 మంది ఎమ్మెల్యేలు అవసరం పడతారు. టీడీపీకి మద్దతు ఇచ్చే నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే గంటాతో కలిపి అయిదుగురు ఆ పార్టీకి లేనట్లే అవుతారు. అంటే టీడీపీ నంబర్ 18కి పడిపోతుంది.

టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలి అంటే మొత్తం 55 ఎమ్మెల్యే ఓట్లలో ఇంకా 37 ఓట్లు సాధించాల్సి ఉంటుంది అని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే ఇది బిగ్ టాస్క్ గానే టీడీపీకి ఉండబోతోంది. అయితే వైసీపీ మొత్తం మార్పు చేర్పులలో ఏకంగా ముప్పయి మంది ఎమ్మెల్యేలకు సీటు మార్పు చేయబోతోంది. అంటే ఆ లెక్క అంతా ఇటు వైపు తిరిగితే టీడీపీకి అపుడు విజయానికి దగ్గర అవుతుంది అని అంటున్నారు.

అయితే ఈ ముప్పయి మందిలో చాలా మందికి వేరే చోట అవకాశం ఇస్తున్నారు. మరి కొంతమందికి హామీ ఇస్తున్నారు. ఇంకొంతమందిని బుజ్జగిస్తున్నారు అందువల్ల ముప్పయి మందిలో మొత్తానికి మొత్తం టీడీపీకి మద్దతు ఇచ్చే చాన్స్ లేదు అన్నది మరో వాదన.

అలా చూసుకుంటే కచ్చితంగా పది నుంచి పదిహేను మంది అయినా మద్దతు ఇస్తే మాత్రం టీడీపీకి గెలుపునకు చాలా దూరంలో ఉండిపోతుంది. అపుడు వైసీపీ సునాయాసంగా ఈ మూడు సీట్లు గెలుచుకుంటుంది. అందుకే వైసీపీ ఒక స్ట్రాటజీ ప్రకారమే గంటాతో కధ మొదలెట్టింది అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా వైసీపీకి రాజ్యసభ ఎన్నికలు ఒక సవాల్ అని అంటున్నారు.

మొత్తం మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంటే అసెంబ్లీ ఎన్నికల ముందు బిగ్ బూస్ట్ వచ్చినట్లు అవుతుంది. అదే టైం లో రాజ్యసభలో మొత్తం ఏపీకి చెందిన 11 ఎంపీలను తమ పార్టీ ఖాతాలో వేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు అవుతుంది.

ఇక టీడీపీకి ఇది జీవన్మరణ సమస్య. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా వైసీపీకి ఝలక్ ఇస్తే అది అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తోంది. అదే విధంగా రాజ్యసభలో తమ పార్టీ ప్రాతినిధ్యం ఉంటుందని గట్టిగా నమ్ముతోంది. సో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టడం ఖాయం. ప్రలోభాలకు తెర లేవడం ఖాయం. గెలుపు ఎవరిది అన్నది మాత్రం లాస్ట్ వరకూ టెన్షన్ గానే ఉండబోతోంది.