Begin typing your search above and press return to search.

ఎంపీపై వేటు ఖాయమేనా ?

మొయిత్రాను ఎంపీగా అనర్హురాలిని చేయాలని ఎథిక్స్ కమిటి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సిఫారసు చేయటం ఇపుడు సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 6:11 AM GMT
ఎంపీపై వేటు ఖాయమేనా ?
X

పశ్చిమబెంగాల్ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడటం ఖాయమేనా ? క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు చూస్తుంటే ఇలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. మొయిత్రాను ఎంపీగా అనర్హురాలిని చేయాలని ఎథిక్స్ కమిటి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సిఫారసు చేయటం ఇపుడు సంచలనంగా మారింది. నిజానికి ఎంపీపై అనర్హత వేటు వేసే అవకాశం కానీ స్పీకర్ కు, సిపారసు చేసే అధికారం ఎథిక్స్ కమిటికి లేవు. అయినా లేని అధికారాలను చేతుల్లోకి తీసుకుని కమిటి సిఫారసు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇంతకీ మొయిత్రాపై అనర్హత వేటు వేయమని ఎందుకు సిఫారసుచేసింది ? ఎందుకంటే లోక్ సభలో ప్రశ్నలు అడిగినందుకు మొయిత్రా పారిశ్రామికవేత్త హీరానందాని దగ్గర నుండి భారీ ఎత్తున డబ్బులు, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనే మొయిత్రాను కమిటి విచారించింది. అయితే ఆరోపణలను ఎంపీ అంగీకరించలేదు. పారిశ్రామికవేత్త నుండి తాను లిప్ స్టిక్స్, మేకప్ కిట్లు మాత్రమే తీసుకున్నాను కానీ డబ్బులు తీసుకోలేదని అంటున్నారు.

అంటే ప్రశ్నలు వేసినందుకు తాను నందాని నుండి లబ్దిపొందినట్లు ఎంపీయే అంగీకరించినట్లయ్యింది. అయితే ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా కొందరు ఎంపీలు ఇవే ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొదటినుండి నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని లోక్ సభలో మొయిత్రా దుమ్ముదులిపేస్తున్నారు. ప్రభుత్వంలోని లోపాలను, ప్రభుత్వం చేస్తున్న తప్పులపై మొయిత్రా అనర్గళంగా లోక్ సభ సమావేశాల్లో పదేపదే మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇలాంటి అనేక కారణాలతో ఇపుడు దొరికారు కాబట్టి ఏకంగా అనర్హత వేటు వేయాలని కమిటి సిఫారసుచేసింది. నిజానికి డబ్బులు తీసుకుని లేదా ప్రలోభాలకు లొంగి లోక్ సభలో ప్రశ్నలు వేయటం తప్పని చట్టంలో లేదు. ఇలాంటివన్నీ నైతికత కిందకు వస్తుంది. కాబట్టి ఎంపీలు ఎవరికి వారుగా డిసైడ్ చేసుకోవాల్సిందే. అనర్హత వేటు వేయాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో లేనపుడు ఎంపీపై అనర్హత వేటు వేయాలని కమిటి సిఫారసు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మరి స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.